కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాల ఘటన సంచలనంగా మారింది. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని, విద్యార్థినుల వీడియోలు తీసి బయట అమ్ముకున్నాడని, హిడెన్ కెమెరా ద్వారా సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై విద్యార్థినులు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
హిడెన్ కెమెరాల ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతిపక్ష వైసీపీ, అధికార టీడీపీ మధ్య ఈ విషయమై ట్వీట్ వార్ నడుస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిది కావడంతో యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. వారంరోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని, న్యాయం కోసం విద్యార్థినులు ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వైసీపీ ఆగ్రహిస్తోంది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన పోస్టర్‌లు ఉన్నాయని వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని, నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలైనా, ప్రభుత్వం పట్టించుకోలేదని వైసీపీ మండిపడుతోంది.
ఈ ఘటనపై అధికార పార్టీ టీడీపీ స్పందించింది. హిడెన్ కెమెరాల ఫిక్స్ చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో ఏం జరుగుతోందని ఆరా తీశారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు జరిపిస్తామని, తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టంచేశారు.