రాజకీయ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారని.. అధికారం కోసం ఏదైనా చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఈ విషయంలో జగన్ మాత్రం విరుద్ధం. నిజంగా ఆయన పదవి కోసం పాకులాడే వ్యక్తి అయ్యి ఉంటే.. 2014లోనే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు. కేవలం ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆయనకు 2014లోనే అధికారం చేజిక్కేది. కానీ.. ఆయన నిజాయితీకి విలువ ఇవ్వడం వల్లే… అప్పుడు ఆయన సీఎం కాలేపోయారు.
మొదటి నుంచి జగన్‌ది అదే ఫిలాసఫీ. చెప్పింది చేయాలి అనేది వైఎస్ జగన్ ఫిలాసఫీ. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని జగన్‌కు ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అయితే, ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో ఆయన ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు.
రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రైతులకు చెందిన 89 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. నిజంగానే ఆయన రుణమాఫీ చేస్తారని ప్రజలు ఓట్లు వేశారు. దీంతో.. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాఫీ చేసిన రైతు రుణాలు కేవలం 15 వేల కోట్లు. ఎన్నికల్లో విజయం సాధించడానికి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటే. ఇక్కడ కూడా అదే చేశారు. అదే అబద్ధం జగన్ చెప్పి ఉంటే.. కచ్చితంగా అధికారంలోకి వచ్చేవారు. కానీ.. అది జరిగే పని కాదని జగన్‌కి తెలుసు అందుకే అబద్ధపు హామీ ఇవ్వలేదు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు దాదాపు 600 హామీలు ఇచ్చారు. వాటిలో ఎన్నింటిని అమలు చేశారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలను గుర్తు చేసి ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మ్యానిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తీసేయించారు. ఇదీ చంద్రబాబు నైజం. ఇక జగన్ నిజాయితీ గురించి కూడా స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజాయితీయే 2019లో ఆయనను గెలిపించింది.. అధికారంలో నిలపెట్టింది. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనను ఆ నిజాయితీయే గెలిపిస్తుంది.