తెలంగాణలో హైడ్రా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఐతే విజయవాడ వరదలకు బుడమేరు ఆక్రమణలే కారణమని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ విజయవాడలో వరదలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు దిగువన బుడమేరు సక్రమంగా కొల్లేరులో కలిసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇందుకోసం ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. మొదటగా ఆపరేషన్ బుడమేరు చేపడతామన్నారు. ఇందులో భాగంగా బుడమేరు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో మరో ప్రశ్నకు అవకాశమే లేదన్నారు చంద్రబాబు.
దాదాపు 2 లక్షల 20 వేల కుటుంబాలకు నష్టం జరిగిందని, ప్రభుత్వం మొత్తం ఇక్కడే పని చేయాల్సి వచ్చిందని చెప్పారు చంద్రబాబు. కొంతమంది స్వార్థపరుల కోసం ప్రభుత్వం, లక్షలాది మంది ప్రజలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వరదల్లో చాలా మంది జీవితకాలం సంపాదించుకున్న డబ్బంతా పోయిందని, పలువురు అనాథలుగా మారారని చెప్పుకొచ్చారు. కొంతమంది రాజకీయ అండతో విచ్చలవిడిగా ఆక్రమణలు చేశారన్నారు చంద్రబాబు. ప్రజల సేఫ్టీనే తనకు ముఖ్యమని చెప్పారు.