హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు అదనపు అధికారాలు ఇచ్చి మరీ రంగంలోకి దించుతోంది. తాజాగా కూకట్ పల్లి ప్రాంతంలో జరిగిన కూల్చివేతలు మరోసారి వివాదాస్పదంగా ముగిశాయి. నోటీసులిచ్చే కూల్చివేశామని హైడ్రా చెబుతుండగా.. తమకి అలాంటి సమాచారం లేదని బాధితులు వాపోతున్నారు. భూ యజమానులు చేసిన మోసానికి లీజుదారులు మోసపోయారు.
కూకట్ పల్లి ప్రాంతంలోని నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న షెడ్లను తాజాగా హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ఇక్కడ భూమి ఉన్న పట్టాదారులు వాటిని ఆల్రడీ లీజుకిచ్చేశారు. వాటిల్లో లీజుదారులు షెడ్లు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. షెడ్ల నిర్మాణానికి అయిన ఖర్చుని లీజులో క్రమక్రమంగా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇవి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్మాణాలు కావడంతో హైడ్రా నోటీసులిచ్చి కూల్చివేసింది.
హైడ్రా నోటీసుల్ని పట్టాదారులకు పంపించింది. అయితే వారు సైలెంట్ గా ఉన్నారు. లీజు దారులకు విషయం చెప్పలేదు. దీంతో నోటీస్ పీరియడ్ అయిపోయిన వెంటనే హైడ్రా బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టింది. అసలు నోటీస్ ల విషయమే తమకు తెలియదంటూ లీజుదారులు లబోదిబోమన్నారు. వ్యాపారం కోసం తెచ్చిన సామాను నాశనమైపోయిందని విలవిల్లాడిపోయారు. 16 నిర్మాణాలు కూల్చివేయడంతో బాధితులు వేదన అక్కడ ఉన్నవారందర్నీ కలచివేసింది.