ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కడం మొదలైంది. ముఖ్యంగా టీడీపీలో గుబులు పెరిగాయి. వైసీపీ నుండి టీడీపీలోకి వలస వస్తున్న ఎమ్మెల్యేతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో మాజీ మంత్రి దేవినేని ఉమ టికెట్ ఆశలకు గండి పడింది. ఇప్పటికే దేవినేని టికెట్‌కు వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వసంత రాకతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.ఇదే తరహాలో పెనమలూరు, తిరువూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో కూడా టీడీపీలో గొడవలు చెలరేగుతున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవడంతో వారు టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీలో ఇప్పటికే ఉన్న నేతలతో గొడవలు మొదలయ్యాయి.
టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న నియోజకవర్గాల్లో ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఐదేళ్ళు పవర్‌ను ఎంజాయ్ చేసి చివరి నిమిషంలో టికెట్లు దక్కని కారణంగా టీడీపీలో చేరితే టికెట్లు ఎలా ఇస్తారంటూ టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబును నిలదీస్తున్నారు.
జనసేనలో కూడా ఇలాంటి గొడవలు ఉన్నప్పటికీ, అక్కడ టీడీపీ నేతల ప్రభావం లేకపోవడంతో పరిస్థితి చాలావరకు అదుపులో ఉంది. చంద్రబాబు దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. టికెట్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దానిపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.