దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు జరిగేలా కుట్రపూరిత యత్నాలు చేపడుతున్నారని ఇండియన్ రైల్వే వెల్లడించింది. కొందరు దుండగులు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వివరించింది. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయని తెలిపింది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగుచూడటమే దీనికి నిదర్శనమని పేర్కొంది. గతేడాది జూన్ నుంచి ఈ తరహా ఘటనలు 24 జరగగా, అందులో ఆగస్టులో 15, సెప్టెంబర్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ఇలాంటి పరిస్థితులు కనిపించాయని వివరించింది.
రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఇండియన్ రైల్వే తెలిపింది. ఇలాంటి ఘటనలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో బయటపడ్డాయని పేర్కొంది. ఆగస్టులో కాన్పూర్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు పట్టాలు తప్పాయని తెలిపింది. ట్రాక్‌పై ఉంచిన ఓ వస్తువు కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఆ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని తెలిపింది. ఆదివారం మరోసారి కాన్పూర్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లలో ఈ ఘటనలు వెలుగుచూశాయని ఇండియన్ రైల్వే వివరించింది.
ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టిందని, ట్రాక్‌పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టు గుర్తించిన లోకో పైలట్.. వెంటనే అత్యవసర బ్రేకులు వేశారని ఇండియన్ రైల్వే తెలిపింది. అయినప్పటికీ రైలు ఆ సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు కొంత దూరంలో ఎగిరిపడిందని, అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించింది. లోకో పైలట్, రైల్వే గార్డు దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపింది. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్‌తో పాటు ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె, నాలుగు గ్రాముల పేలుడు పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించింది. అజ్మీర్ సమీపంలోని పట్టాలపై సిమెంట్ బ్లాక్‌లను అధికారులు గుర్తించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, రైల్వే శాఖ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది వేచిచూడాలి.