ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కుహనా మేధావులు చాలా మంది వ్యతిరేకించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా వ్యతిరేకించారు. ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చినవారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. తెలుగు భాషా పరిరక్షణ పేరు మీద వారు దాన్ని వ్యతిరేకించారు. తెలుగు భాషను రక్షించాల్సిన బాధ్యత నిరుపేదలకే ఉన్నట్లు మాట్లాడారు. అయితే, ఎందరు వ్యతిరేకించినా మొండిగా మడమ తిప్పకుండా జగన్ ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. అది ప్రస్తుతం ఫలితాలను ఇస్తోంది.
జగన్ ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణల వల్ల పేదల పిల్లలు కూడా అంతర్జాతీయ స్థాయిలో తమ గొంతు విప్పే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. నాడు – నేడు, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ట్యాబ్లు, ఐబీ, సీబీఎస్ఈ సిలబస్ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులను చూసి తమకు కూడా అలా చదువుకునే అవకాశం ఉంటే బాగుండేదని భావించిన పిల్లలకు జగన్ అత్యుత్తమమైన విద్యను, పాఠశాలల ఆవరణలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన, చదువుతున్న పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారు. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడి తలెత్తుకుని జీవించే వ్యక్తిత్వాలను సంతరించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు ఐక్య రాజ్యసమితిలో మాట్లాడగలిగే ప్రతిభను సంతరించుకున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ప్రపంచ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఊరు పొలిమేరలు కూడా దాటని పేదల పిల్లలు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కాలు పెట్టగలిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు 190 దేశాల సభ్యత్వం ఉన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కింది. జగన్ ముందు చూపు వల్ల ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణల వల్ల పేదల జీవితాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. పేదల పిల్లలు కూడా దేశ, విదేశీ సంస్థల ఉద్యోగాలకు సంపన్న వర్గాల పిల్లలతో పోటీ పడగలిగే సత్తాను పొందుతున్నారు.
పేదల కోసం అత్యుత్తమైన విద్యను అందించడానికి అమలు చేస్తున్న సంస్కరణల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంత మాత్రం కూడా ఉచితాలు కానేరవు. అది సామాజిక పెట్టుబడి. భవిష్యత్తులో సామాజిక అసమానతలు తగ్గేందుకు అవి పాదులు వేస్తాయి.