ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవాకులు చెవాకులు పేలుతుంటారు. జగన్‌ను కొత్త పదాల కూర్పుతో ఆయన తిట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎల్లో మీడియాలో వస్తుంటాయి. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు పట్టించుకోరు. వాటిపై వ్యాఖ్యలు చేయరు. ఎందుకో తెలుసా…?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై జగన్ వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు దత్తపుత్రుడంటూ ఆయనపై విరుచుకుపడుతుంటారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై కూడా ఆయన తీవ్రంగానే వ్యాఖ్యలు చేస్తారు. కానీ నారా లోకేష్‌ను మాత్రం పట్టించుకోరు. టీడీపీలో నెంబర్ టూగా చెలామణి అవుతున్న నారా లోకేష్‌ను ఆయన గుర్తించరు. నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డ. చంద్రబాబు రాజకీయాలతో ఆయన వారసుడిగా రుద్దబడిన వ్యక్తి. స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఆయనకు లేవు.
విషయాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడగలిగే శక్తి నారా లోకేష్‌కు లేదు. ఎన్నికల్లో విజయం సాధించే సత్తా లేదు. మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రబాబు ఆయనను శాసనమండలికి పంపించి, మంత్రిని చేశారు. చంద్రబాబు లేకపోతే స్వతహాగా మంత్రి అయ్యే అవకాశం ఆయనకు లేదు. అందుకే చంద్రబాబు ఆయనను వెనక బెంచీలోనే కూర్చోబెడుతున్నారు.
జగన్ స్వతహాగా నాయకుడిగా ఎదిగినవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నీడలో ఆయన రాజకీయ నాయకుడిగా ముందుకు రాలేదు. తండ్రి మరణం తర్వాత ఉక్కు సంకల్పంతో పార్టీని పెట్టి, మొదటిసారి ఓటమి పాలైనా కూడా నిలబడి, రెండోసారి వైసీపీని విజయపథాన నడిపించారు. అటువంటి నాయకుడికి నారా లోకేష్ పెద్ద సరుకు కాదు. కానీ, జగన్ తనను గుర్తించాలని, తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నట్లుగా నారా లోకేష్ వ్యాఖ్యలు ఉంటాయి.
నారా లోకేష్ ఉనికిని కూడా జగన్ గుర్తించినట్లు కనిపించరు. తాను ప్రతిస్పందిస్తే అనవసరంగా లోకేష్‌ను గుర్తించినట్లు అవుతుందని, అనామకుడిగా ఉంచడమే మంచిదని జగన్ భావిస్తూ ఉండవచ్చు. లోకేష్ స్థాయిని పెంచడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ ఎంతగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా జగన్ స్పందించరు. లోకేష్‌కు అదే మంచి మందు అని ఆయన భావిస్తున్నారని ఆనుకోవాలి.