ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే ఎక్కడ విజయం సాధించవచ్చు అనే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. ఈ క్రమంలోనే లోకేష్(lokesh)ని ఓడించేందుకు ఆయన ఉచ్చు బిగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వదిలి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. జగన్(Jagan) మీద అలిగి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆళ్ళ మళ్ళీ వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఆళ్ళకి జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో అలిగిన ఆయన షర్మిలతో పాటు కాంగ్రెస్‌లో చేరారు.
అయితే నెల రోజులు కూడా తిరగకముందే షర్మిలతో పొసగక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆళ్ళ రాకతో నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. మంగళగిరిలో బీసీ సామాజికవర్గంలో చేనేతలు చాలా ఎక్కువ. వీళ్ళతో పాటు ఎస్సీ, మైనారిటీ, రెడ్డి తదితర సామాజికవర్గాలున్నాయి. లోకేష్‌ను రెండోసారి కూడా ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా చేనేతలకే చెందిన గంజి చిరంజీవిని టీడీపీలో నుండి వైసీపీలో చేర్చుకుని నియోజకవర్గ ఇన్చార్జిని చేశారు. దాంతో అందరూ చిరంజీవికే టికెట్ ఖాయమనుకున్నారు.
అయితే సడెన్‌గా వారం రోజుల క్రితం అభ్యర్థి విషయంలో చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, చిరంజీవితో చర్చించారు. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో కమలను అభ్యర్థిగా ప్రకటించాలని జగన్ డిసైడ్ అయ్యారట. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కమల, మురుగుడు వియ్యంకులవుతారు. కాబట్టి కమల గెలుపునకు మురుగుడు, చిరంజీవి గట్టిగా పనిచేస్తే లోకేష్ గెలుపు కష్టమే.
వైసీపీ ఓట్లు+రెడ్డి ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ళ చీల్చుకుంటారు కాబట్టి తన గెలుపు ఖాయమని లోకేష్ అండ్ కో అనుకున్నారు.రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాబట్టి తాను ఈజీగా గెలుస్తానని కూడా లోకేష్ అంచనా వేసుకున్నారు. కానీ వాళ్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. వీళ్ళు ఊహించని విధంగా ఆళ్ళ తిరిగి వైసీపీలో చేరిపోయారు. కమల లేదా చిరంజీవి గెలుపునకు పనిచేస్తానని జగన్‌కు ఆళ్ళ మాటిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అంటే ఒకవైపు చేనేత సామాజికవర్గం ఓట్లు, మరోవైపు ఆళ్ళ వర్గం+చిరంజీవి లేదా కమల సహకారం, అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం అని ఈ పాటికే క్లారిటీ వచ్చేసింది. ఈ లెక్కన మంగళగిరిలో ఎంత కష్టడినా ఈ సారి కూడా లోకేష్ గెలవడం కష్టమే.