ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నిర్ణయంతో సీఎం చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. వారి ఇళ్లలోని పిల్లలకు అత్యుత్తమ చదువులు చెప్పిస్తారు కానీ, గవర్నమెంట్ స్కూళ్లలోని పిల్లలపై ఎందుకీ వివక్ష అని నిలదీశారాయన. పేదలు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా, వారి జీవితాలకు మీరు శాపం పెడతారా..? అని ప్రశ్నించారు. విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. లేకపోతే పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ చంద్రబాబుని హెచ్చరించారు జగన్. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ వేశారు.
https://x.com/ysjagan/status/1835643533346099445
నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్ లవైపు వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పారు జగన్. టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, క్లాస్ రూమ్స్ లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చేందుకు తాము ప్రయత్నించామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిలో ఒక్కొక్కటీ రద్దవుతున్నాయని, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు జగన్. టీడీపీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలనే దురుద్దేశంతో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియాన్ని వ్యతిరేకిస్తూ గతంలో ఈనాడు లాంటి పత్రికలు కోర్టులకు సైతం వెళ్లాయని, ఆ సంఘటనలను ప్రజలెవరూ మరచిపోలేదని చెప్పారు జగన్.
ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న టీచర్లు దేంట్లోనూ, ఎవరికీ తక్కువకాదని, వారంతా తెలివైన వారని.. చక్కటి శిక్షణ పొందిన వారని.. అలాంటి వారిని తక్కువచేసి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని తాము ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారిని నిరుత్సాహపరుస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ స్కూళ్లను దెబ్బతీస్తున్నారని అన్నారు జగన్.