ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. చెప్పాలంటే, వైయస్ జగన్ ప్రత్యర్థులపై ఇప్పటికే విజయం సాధించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప జగన్‌ను ఢీకొట్టలేమని భావిస్తున్నారు. అందుకే జనసేనతో పొత్తుకు సిద్ధపడ్డారు. బీజేపీతో పొత్తు కోసం సాగిలబడుతున్నారు. ఇది చంద్రబాబు బలహీనతను, వైయస్ జగన్ బలాన్ని తెలియజేస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాలా కాలంగా అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని ఆయన కోరుతున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పినందుకు తాను బీజేపీ అగ్రనేతలతో చీవాట్లు తిన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. వారికి తాను దండాలు పెట్టానని కూడా చెప్పారు. అంటే, జగన్‌ను ఏ పార్టీ కూడా ఒంటరిగా ఎదుర్కోలేదనే విషయం ఆయన తీరులోనూ మాటలోనూ వ్యక్తమవుతూనే ఉంది.
అందరూ కలిసికట్టుగా తనపై యుద్ధానికి దిగుతున్నప్పటికీ వైయస్ జగన్ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధపడ్డారు. తమ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాతో ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాటల్లోనూ, చేతల్లోనూ చూపుతున్నారు. ఈ రకంగా చూస్తే ఇప్పటికే వైఎస్ జగన్ ప్రత్యర్థులపై నైతిక విజయం సాధించినట్లు.
మరో విషయం కూడా చెప్పాలి. తామంతా కలిసి పోటీ చేస్తే తప్ప జగన్‌ను ఎదుర్కోలేమనే ప్రతిపక్షాల తీరు చూస్తే జగన్ బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో కూడా తెలిసిపోతోంది. జగన్‌ను విడిగా ఎదుర్కోలేమనే టీడీపీ, జనసేన భావిస్తున్నాయంటే అవి ఓటమిని అంగీకరించినట్లే లెక్క.