మూడు పార్టీల మధ్య పొత్తులో జనసేన బకరా అయిపోయినట్లుంది. టీడీపీ – జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరిన ప్రభావం ముఖ్యంగా జనసేన మీదే పడింది. ఫలితంగా జనసేన పోటీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మొదట్లో టీడీపీ – జనసేన పొత్తులో పవన్ పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. తర్వాత బీజేపీ కూడా వీళ్ళతో చేతులు కలిపింది. పొత్తు పెట్టుకునే విషయమై దాదాపు నెల రోజులు పాటు సాగదీసిన బీజేపీ చివరకు ఓకే చెప్పింది. అయితే సీట్ల సంఖ్య, పోటీ చేయబోయే నియోజకవర్గాలపై గట్టిగా పట్టుబట్టి సాధించుకుంది.
దీని ఫలితమే మిత్రపక్షం జనసేన పోటీ చేయబోయే సీట్లలో కోతపడింది. జనసేన 24 సీట్లలో కాకుండా 21 నియోజకవర్గాల్లోనే పోటీ చేయబోతోంది. అలాగే మూడు లోక్‌సభ సీట్లలో కూడా ఒకదాన్ని వదులుకుంది. మొదట్లో కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంటు సీట్లలో పోటీ చేయాలని అనుకున్నా చివరకు అనకాపల్లి సీటును బీజేపీకి వదులుకుంది. చంద్రబాబు మాత్రం టీడీపీ పోటీ చేయబోయే అసెంబ్లీ సీట్లను పెద్దగా త్యాగం చేయలేదు. మొదటి నుండి బీజేపీకి 6 అసెంబ్లీలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు మరో నాలుగు సీట్లను అదనంగా ఇచ్చారంతే.
అదనంగా ఇచ్చిన 4 సీట్లలో జనసేనకు కేటాయించిన మూడు సీట్లను కోతపెట్టారు. నిజానికి బీజేపీ పోటీ చేయబోయే 10 అసెంబ్లీ సీట్లను టీడీపీ తన కోటాలో నుండే కేటాయించాలి. కానీ చంద్రబాబు మాత్రం జనసేన కోటాలో కూడా కోతపెట్టేశారు. ఇందుకనే జనసేన బకరా అయిపోయిందనే ప్రచారం పెరిగిపోతోంది. మొదట్లో జనసేన తీసుకున్న 24 సీట్లే చాలా తక్కువని కాపు ప్రముఖులు, సామాజికవర్గంలోని నేతలు గోల చేస్తున్నారు. అలాంటిది ఇచ్చిన సీట్లలో కూడా మరో మూడింటిలో కోతపడేసరికి ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థంకావటంలేదు.
సీట్ల సర్దుబాటు చర్చల్లో పవన్ పరిస్థితి చాలా దయనీయంగా తయారైన విషయం అర్థమైపోతోంది. ఎందుకంటే ఎన్నిసీట్లు తీసుకోవాలి? ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులుగా ఎవరిని దింపాలనే విషయంలో పవన్‌కు కనీస అవగాహన కూడా ఉన్నట్లులేదు. పవన్ పరిస్థితిని చంద్రబాబు సాంతం తనకు అనుకూలంగా వాడేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి తాజా పరిణామాల్లో పవన్ విషయమై కాపు సామాజికవర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.