చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ట్రైలర్ ఇప్పుడే మొదలైనట్లుంది. ఇప్పటివరకు అధికారికంగా రెండుపార్టీలు కలిసి ఒక్క టికెట్ ను కూడా ఫైనల్ చేయలేదు. చంద్రబాబు రెండు టికెట్లను ప్రకటిస్తే, పవన్ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారంతే. దానికే రెండుపార్టీల్లోను మూడు రోజుల పాటు రచ్చరచ్చయిపోయింది. దానికి కొనసాగింపుగా మరో కొత్త నియోజకవర్గంలో గొడవ మొదలైంది. ఆ నియోజకవర్గం ఏమిటంటే విజయవాడ వెస్ట్.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో తనకు కాకుండా ఇంకోరికి టికెట్ ఇస్తే ఉరేసుకుని చస్తానని మాజీ ఎంఎల్ఏ జలీల్ ఖాన్ ప్రకటించారు. ప్రకటించారు అనేకన్నా చంద్రబాబుకు వార్నింగిచ్చారని చెప్పాలి. ఈ వివాదాస్పద నేత ఇంతకాలం మౌనంగా ఉండి ఇపుడు సడెన్ గా యాక్టివ్ అయ్యారు. పోయిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఈయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే పట్టుబట్టి తన కూతురికి టికెట్ సాధించుకున్నారు. అయితే ఆమె ఓడిపోయింది. అప్పటినుండి తండ్రి, కూతుళ్ళు చప్పుడుచేయలేదు. చంద్రబాబు, పవన్ మూడు, నాలుగు రోజుల్లో టికెట్లు ఫైనల్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
సరిగ్గా ఈ సమయంలో జలీల్ తెరమీదకు వచ్చారు. ఇప్పటికే ఈ టికెట్ కోసం టీడీపీ తరపున బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా ప్రయత్నిస్తున్నారు. జనసేన తరపున పోతిన మహేష్ తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్ బెదిరిస్తున్నారు. మళ్ళీ మాటమార్చి తనకు టికెట్ దక్కకపోతే ఉరేసుకోవటానికి ముస్లిం మైనారిటిలు రెడీగా ఉన్నారంటు మరో బాంబుపేల్చారు.
కూటమిలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీచేస్తుందో తెలీదు కాని చాలా నియోజకవర్గాల్లో పోటీకి రెండుపార్టీల నేతలు రెడీ అయిపోతున్నారు. దాంతో ఎవరికి వారుగా రెండుపార్టీల నేతలు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. దాంతో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. సీటును జనసేనకు వదిలేస్తే తమ్ముళ్ళతో తలనొప్పి. అలాగని టీడీపీనే పోటీచేస్తుందంటే జనసేన నేతలు ఊరుకోరు, ఓట్లు ట్రాన్సఫర్ అవుతుందో లేదో తెలీదు. విజయవాడ వెస్ట్ గొడవ జస్ట్ ట్రయలర్ మాత్రమే ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక సీటును ప్రకటిస్తే అప్పుడు సినిమా మొదలవుతుంది.