రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఈ పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు జూనియర్. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు ఎన్టీఆర్.
ఇటీవలే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా గత వారం కర్ణాటకకు వెళ్లారు. తన తల్లి స్వగ్రామం ఉడుపి జిల్లాలోని కుందాపురాకు వెళ్లారు. ఉడుపి శ్రీ కృష్ణమఠంతో పాటు కొల్లూరులోని మూకాంబికా, కేశవనాథేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు. జూనియర్ ఫ్యామిలీ వెంట కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీకి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. బాలకృష్ణ ఫంక్షన్‌కు జూనియర్‌కు ఆహ్వానం కూడా అందలేదని సమాచారం.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలకు సంబంధించి పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు.