జనసేనాని పవన్ కల్యాణ్‌పై సొంత సామాజికవర్గం కాపు నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తాజాగా తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనసేనకు నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న, పవన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న కాపు సామాజికవర్గాన్ని అవమానించేలా జనసేనకు 24 సీట్లు కేటాయించారని మండిపడుతున్నారు కాపు నేతలు. సీట్ల సంఖ్య పెంచకుంటే టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసే ప్రసక్తే లేదంటున్నారు. కనీసం 50 స్థానాలకు తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తారంటూ మండిపడుతున్నారు. పి.గన్నవరంలో గతంలో జనసేనకు 34 వేల ఓట్లు వచ్చాయని…అలాంటి చోట వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టిన మహాసేన రాజేష్‌కు టికెట్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు.
తెలుగుదేశం తీరును నిరసిస్తూ ఇప్పటికే పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి కాపు కుల సంఘాలు. భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు కాపు నేతలు.