పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు చాలా దుర్మార్గంగా ఉంటున్నాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అంతూ పొంతూ లేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు. కడపలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు షర్మిలకు, జగన్‌కి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం.. రూ.1000 కోట్ల పని చేయాలని అడిగితే జగన్ అందుకు ఒప్పుకోకపోవడమేనని రాఘవరెడ్డి వెల్లడించారు. షర్మిల భర్త, ఆయన పార్టనర్లు దొంగల ముఠాగా ఏర్పడి రూ.1000 కోట్ల పని చేయాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరారని, ఇలాంటివి చేయనని ఆయన కరాఖండిగా చెప్పారని, అప్పటి నుంచే వారి మధ్య దూరం పెరిగిందని తెలిపారు. ప్రజా సేవకే తప్ప కుటుంబ సభ్యులకు మేలు చేసేందుకు సీఎం కాలేదని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
వివేకాపై షర్మిల ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యకరం
తన చిన్నాన్న వివేకానందరెడ్డిపై షర్మిల ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యకరమని కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయనంటే షర్మిలకు పడేది కాదని చెప్పారు. ఆమె ఎన్నోసార్లు వివేకా గల్లా పట్టుకుందన్నారు. పాదయాత్రలో షర్మిల వెంట వివేకా నడవలేకపోతుంటే.. తాను వెళ్లి.. చిన్నాన్న నడవలేకపోతున్నారని, నిదానంగా నడవాలని చెబితే ఆ దరిద్రుడు అలాగే నడుస్తాడులే అని అన్న మాటలు తనకింకా గుర్తున్నాయన్నారు. వివేకా చనిపోయిన ఐదేళ్లలో ఎన్నిసార్లు ఆయన వర్ధంతి. జయంతికి హాజరయ్యారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ వివేకాపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు.
ఆ ప్యాకేజీ ముందే తీసుకో.. ఎన్నికల తర్వాత బాబు ఇవ్వడు
సీఎం వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు రహస్య అజెండాతో షర్మిలను రంగంలోకి దించారని కొండా రాఘవరెడ్డి విమర్శించారు. వారి చేతుల్లో ఆమె కీలుబొమ్మగా మారిందన్నారు. ఆమె కుదుర్చుకున్న ప్యాకేజీ ఎన్నికల్లోపే తీసుకోవాలని, లేకపోతే చంద్రబాబు ఇవ్వడని చెప్పారు. వైఎస్ విజయమ్మ మాట వినకుండా ఏపీలో పీసీసీ అధ్యక్షురాలైనప్పుడే షర్మిల వైఎస్సార్ తనయగా పక్కకు జరిగిందని చెప్పారు.