చంద్రబాబు తీరుపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు మైండ్ పనిచేయడం లేదని, అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు తాను ఏం చేశారో చెప్పుకోలేక బూతులు తిడుతున్నారని హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. చంద్రబాబుకు మెంటలెక్కిందని, సైకోలోగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
147 నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారని తేలినందుకే..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 147 నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నట్టు టీడీపీ వారే ఇంటర్నల్ మీటింగుల్లో చెప్పారని హఫీజ్ ఖాన్ గుర్తుచేశారు. అందుకే జనాన్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేము కూడా మీలాగా మాట్లాడితే మీరు తట్టుకోలేరు చంద్రబాబూ అంటూ హెచ్చరించారు. మోదీని, పవన్‌ని తిట్టిన చంద్రబాబు.. మళ్లీ వారితోనే పొత్తు పేరుతో సంసారం చేస్తునాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై రాయి దాడిని డ్రామా అంటున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని హఫీజ్ అభిప్రాయపడ్డారు.
హత్యా రాజకీయాలను పురిగొల్పిన్న లోకేశ్..
మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ హత్యా రాజకీయాలను పురిగొల్పారని హఫీజ్ మండిపడ్డారు. వైసీపీ నేత వెంకటరెడ్డిని దారుణంగా హతమార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో పేదలను బతకనివ్వలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు సైతం కులాలు, మతాల మధ్య గొడవలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల మనసు గెలవాలే గానీ, గొడవలు పెట్టి ఓట్లు పొందాలని చూడటం కరెక్టు కాదని ఆయన అన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మంచి వైద్యం ఫ్రీగా అందిస్తూ పేదలను కాపాడుతున్న నాయకుడు సీఎం జగన్ అని చెప్పారు. మెడికల్ కాలేజీలు, హార్బర్లు, పోర్టుల నిర్మాణం చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. రూ.69 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను తెచ్చింది జగనే అని చెప్పారు. డబ్బుతో ఓటర్లను మార్చమని అంటున్న జయరాంపై ఈసీ సుమోటోగా కేసు పెట్టాలని ఆయన కోరారు. ఇలాంటి దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.