గీతాంజలిని ఇద్దరు వ్యక్తులు రైలు కిందికి తోసేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. గీతాంజలి మరణంపై జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ ఇచ్చిన వాంగ్మూలం అసలు విషయాన్ని బయటపెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశంసించినందుకు ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నోటితో పలకడానికి కూడా వీలుకాని భాషలో వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆ విషయాన్ని మరుగుపరచడానికి పచ్చ బ్యాచ్ కొత్త డ్రామాకు తెర తీసింది. ఆమెను ఇద్దరు వ్యక్తులు రైలు కిందికి తోసేశారని ఫేక్ వీడియోను తెర మీదికి తెచ్చింది. అయితే, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగు చూసింది.
గుంటూరు నుంచి 12.05 గంటల సమయంలో తెనాలి స్టేషన్‌కు దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకు ఫోన్‌లో మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన యువతి ఒక్కసారి ట్రాక్‌పైకి వచ్చిందని, తప్పుకోవాల్సిందిగా అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేశానని, అయితే అప్పటికే రైలు ఇంజన్ ఆమెకు తగిలిందని జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ విజయ్‌రామ్ జీఆర్‌పీ పోలీసులకు అప్పుడే వాంగ్మూలం ఇచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సాయంతో రైలు ఎక్కించి తెనాలి స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు.
వాస్తవం అది కాగా, టీడీపీ సోషల్ మీడియాలో గీతాంజలి ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పారిపోయినట్లుగా ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తూ తప్పుడు వీడియోను సర్క్యులేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని ఎడిట్ చేసి వదిలినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ వీడియోను సర్క్యులేట్ చేసింది ఎవరనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.