“చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూ రాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?”
2019 ఆగస్ట్ 16న నారా లోకేష్ వేసిన ట్వీట్ ఇది. కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని వరదనీటిలో ముంచేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు లోకేష్. అయితే ఇప్పుడు ఆ ఇల్లు నిజంగా ముంపుబారిన పడింది. వరదనీరు మరింత ఎక్కువైతే చంద్రబాబు ఇంట్లోకి కూడా కృష్ణమ్మ అడుగుపెడుతుంది. మరి దీన్ని ఎవరి కుట్రగా చూడాలంటూ వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు ఆమాత్రం కృష్ణానది వరదను ఆపుకులేరా అంటూ కౌంటర్లిస్తున్నారు వైసీపీ నేతలు.
“మా ఇంటిని కూడా ముంచేయాలని నీళ్లు ఎక్కువ నిలబెట్టారు. అమరావతిని ముంచేయాలని నీళ్లు వదిలిపెట్టారు. అక్కడ ముంచలేక మీ కొంప ముంచారు..” అంటూ చంద్రబాబు కూడా అప్పట్లో వరద రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు భారీ వర్షం నిజాన్ని బయటపెట్టింది. అప్పట్లో చంద్రబాబు, లోకేష్ చేసినవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలేనని రుజువు చేసింది. కృష్ణానదికి భారీ వరద వస్తే కరకట్ట ఇల్లు మునిగిపోతుందని, భారీ వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతం చెరువులా మారిపోతుందని తేలిపోయింది. దీన్ని కవర్ చేసుకోడానికి ఇప్పుడు టీడీపీ నేతలు నానా తంటాలు పడిపోతున్నారు.
ఇదే రాజధాని ప్రాంతం.. ఈ నీట మునిగిందే రాజధాని. వరదనీటిలో ఏపీ కేపిటల్ సిటీ, కాలవలా మారిన హైకోర్టు దారి.. అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రికార్డ్ స్థాయి వర్షాలతో విజయవాడ, గుంటూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజధాని ప్రాంతం కూడా నీటమునిగింది. దీంతో అమరావతి, రాజధానికి అనువైన ప్రాంతం కాదనే వాదనను మరోసారి వైసీపీ తెరపైకి తెచ్చింది. అమరావతి పరిస్థితిని చూపిస్తూ చంద్రబాబు విజన్ పై సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.