నరసాపురం సీటు నాదే.. నా బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలియదు.. అంటూ మిడిసిపడిన రఘురామకృష్ణరాజుకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కకపోవడం ద్వారా గట్టి షాకే తగిలింది. దీంతో జగనే తనకు సీటు రాకుండా చేశాడంటూ సీఎం వైఎస్ జగన్‌పై రఘురామ తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన రఘురామకృష్ణరాజు ఆ సీటు వేరొకరికి కేటాయించడంతో వైసీపీపై నిందలు వేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తనకు ప్రధాని తెలుసు, అమిత్‌షా తెలుసు, నడ్డా తెలుసంటూ ప్రగల్భాలు పలికిన రఘురామ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. తాడేపల్లిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజుకు దమ్ముంటే నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
వలంటీర్లంటే వణుకెందుకు పవన్?
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్న వలంటీర్లంటే పవన్‌కు వణుకెందుకని ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రజల మధ్య అనుసంధానకర్తలుగా వలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. వారిపై పవన్ ఇష్టానుసారం గా నోరుపారేసుకోవటం మంచిది కాదన్నారు. కరోనా సమయంలో వలంటీర్లే ప్రజల ప్రాణాలను కాపాడగలిగారని ఆయన గుర్తుచేశారు. వలంటీర్ల వ్యవస్థపై ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ సేవలన్నీ తమకు అందేలా కృషి చేస్తున్నారని ఆనందంతో ఉన్నారని ఆయన చెప్పారు. వలంటీర్లపై, వలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో సదభిప్రాయం కలగడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన తెలిపారు.