రాజ్యసభలో వైసీపీ బలం తగ్గుతోంది. టీడీపీ ప్రలోభాలతో ఇద్దరు ఎంపీలు తమ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామా లేఖలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో తనకు రేపల్లె టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందాను అన్నారు మోపిదేవి వెంకట రమణ. తనను కాదన్నారంటే.. తనకంటే సమర్థుడికి ఇచ్చినా ఒప్పుకునేవాడిని అన్నారు. తనకు జాతీయ రాజకీయాలకంటే స్టేట్ పాలిటిక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పారు. వైసీపీ ఓడిపోయిందని, ప్రస్తుతం అధికారం లేదని పార్టీ వీడటం లేదని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో, తనకున్న ఇబ్బందులు, సమస్యలతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని మోపిదేవి వెంకట రమణ చెప్పారు. తన నిర్ణయం ఇప్పటిది కాదని, చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నానని, ఈ నిర్ణయం గతంలో తీసుకున్నానని చెప్పారు. కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, ఇప్పటికీ ఓటమిపై జగన్ సమీక్ష జరపలేదన్నారు.
తన అనుచరులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తాను పార్టీ మారుతున్నానని, త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. కాగా, మోపిదేవి వెంకట రమణ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ.. జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తరువాత మంత్రి పదవికి రాజీనామా చేయించి, రాజ్యసభకు పంపించారు.
బీద మస్తాన్‌రావు మాత్రం తన రాజీనామా అనంతరం కాస్త హుందాగా మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీని వీడుతున్నానని, రాజకీయ భవిష్యత్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాజ్యసభ సభ్యునిగా వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని, అందుకు దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు జాతీయ రాజకీయలంటేనే ఇష్టమని, రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తిలేదంటూ కామెంట్ చేశారు.
టీడీపీ ప్రలోభాల కారణంగానే ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పార్టీకి రాజీనామా చేశారని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ ఆరోపిస్తోంది.