ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కూటమి సభ్యులందరూ కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను నిర్వహిస్తూ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. కనీసం మీకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేదా బాబు గారు ఇలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేకపోయినా వినడానికి మాకు సిగ్గుగా ఉంది అంటూ విమర్శించారు. అధికార దాహంతో ఉన్న చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి రాగానే కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని మోసగించాడని విమర్శించారు. ఇచ్చిన హామీని అమలు చేయమంటే తనకు, తన కుటుంబానికి చేయరాని పరాభవం, అవమానాలు చేశారన్నారు.
ఇలా చంద్రబాబు తనని అవమానపరిచినా.. పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు. ఎవరైనా తాము అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన తాగు నీరును అందిస్తామని చెబుతారు కానీ మీలా స్వచ్ఛమైన సారా అందుబాటులోకి తెస్తామని ఎవరు చెప్పారు అంటూ ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కాపు, బలిజ యువతతో ఆడుకోవద్దని తెలిపారు. నువ్వు సినిమాలలో నటించు పర్వాలేదు కానీ రాజకీయాలలో నటించవద్దని తెలిపారు. నువ్వు నీ పార్టీని ప్యాకప్ చెప్పుకొని షూటింగ్కు వెళ్లిపోతే మంచిదని ముద్రగడ అన్నారు. ఇవాళ పేదల నోట్లోకి 5 వేళ్ళు పోతున్నాయి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి చలువ, ఇలా పేదలకు అండగా నిలిచిన జగన్ 10 కాలాలపాటు మంచిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.