తన భర్త, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ను గెలిపించాలంటూ నారా బ్రాహ్మణి మంగళగిరిలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మండుటెండల్లో కార్మికులను, కర్షకులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంగళగిరి అభివృద్ధికి లోకేష్ దగ్గర ప్రణాళిక ఉందని.. ఈ ఎన్నికల్లో అయినా ఆయన్ను గెలిపించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. భర్త విజయానికి భార్య ప్రచారం చేయడం రాజకీయాల్లో కామన్. ఇంతకీ అసలు హీరో లోకేష్‌బాబు ఎక్కడున్నారు? ఆయన సొంత నియోజవకర్గంలో కూడా ప్రచారం చేసుకోలేనంత బిజీగా ఏం చేస్తున్నారబ్బా అని టీడీపీ నేతలే ప్రశ్నించుకుంటున్నారు.
ఏ సభలోనూ కానరారే!
టీడీపీ, జనసేన పొత్తు పొడిచాక తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ నేతలు అందరూ కనిపించినా లోకేష్ జాడ లేదు. పెద్ద వేదిక కదా గభాల్న లోకేష్ వచ్చీరానీ మాటలు మాట్లాడితే పరువు పోతుందని చంద్రబాబు రానివ్వలేదని టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి పాల్గొన్న సభల్లోనూ లోకేశ్ లేరు. టీడీపీలో కీలకనేత కాబట్టి కనీసం తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటయినా వారికి సంఘీభావంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడం లేదు. అంతెందుకు సొంత నియోజకవర్గానికే ప్రచారానికి రావట్లేదు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలూ, రకరకాల అనుమానాలూ వినిపిస్తున్నాయి.
వస్తే ఓడిపోతాడని భయమా?
గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ ప్రచారానికి వస్తే ఓడిపోతానని ఏమైనా భయపడుతున్నారా, అందుకే భార్యను రంగంలోకి దింపారా అనే అనుమానాలూ వస్తున్నాయి. లేకపోతే కూటమి తరఫున కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయినా ఎక్కడా లోకేశ్ కనిపించడం లేదు. కనీసం సొంత నియోజకవర్గానికి కూడా రాకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని టీడీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ విపక్ష శ్రేణులు మాత్రం ఓడిపోతాడనే భయంతోనే లోకేశ్ రావట్లేదని సెటైర్లు వేస్తున్నారు.
మహిళా సెంటిమెంట్‌ను రాజేయాలని..
మంగళగిరిలో చేనేత బిడ్డ మురుగుడు లావణ్యను వైసీపీ పోటీకి దింపింది. మహిళ కాబట్టి ఆమెను ఎదుర్కోవడానికి బ్రాహ్మణితో ప్రచారం చేయిస్తున్నారా అనే విశ్లేషణలూ వస్తున్నాయి. అందుకే ఎప్పడూ ఎండ ముఖం కూడా చూడని బ్రాహ్మణిని మండే ఎండల్లో పొలాలు, పరిశ్రమల్లో తిప్పి ఓట్లు అడిగేలా చేయిస్తున్నారు. అయ్యో పాపం అనుకుని ఓట్లేస్తారనే ప్లాన్ కావచ్చేమో మరి!