టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా టీమ్ ఓ మహిళ ప్రాణాలు తీసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి తాను ప్రయోజనం పొందానని, తనకు ఇంటి పట్టా వచ్చిందని, తన పిల్లలకు అమ్మఒడి సాయం అందుతోందని చెప్పినందుకు గీతాంజలిని టీడీపీ, జనసేన భక్తజనం వెంటాడి వేటాడింది. వైఎస్ జగన్‌ను ప్రశంసించిన గీతాంజలి వీడియో వైరల్ కావడంతో తట్టుకోలేక ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ నడిపించే ఐటీడీపీ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. ఆమెను బూతులు తిట్టారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నోటితో పలకడానికి సిగ్గుపడే మాటలతో ఆమెను వేధించారు. మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఆమె ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ మీదికి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వాస్తవం బయటకు రావడంతో నారా లోకేష్, ఆయన టీమ్ వెనక్కి తగ్గారు. ఆమె మరణంతో తమకు సంబంధం లేదని చెప్పి దులుపేసుకునే ప్రయత్నం చేశారు. స్వాతిరెడ్డి అనే మహిళ కూడా గీతాంజలి మరణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంట్‌ను తెలుగుదేశం మీదికి నెట్టేద్దామని చూశారని, ప్రస్తుతానికి పోలీసులు ఇది ప్రమాదం అంటున్నారని ఆమె అంటూ మరోసారి శవ రాజకీయాల సంస్కృతిని వైసీపీ బయట పెట్టుకుందని ఆమె వ్యాఖ్యానించారు. యాక్సిడెంట్‌ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఐటీడీపీ సోషల్ మీడియా పోస్టుల కారణంగా మనస్తాపానికి గురై గీతాంజలి మరణించినట్లు నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో గీతాంజలి కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించనున్నారు. తెనాలిలోని ఆమె నివాసానికి వైసీపీ నేతలు వెళ్లనున్నారు.
గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వైరల్ చేసిన వీడియోలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మాట్లాడిన వీడియోలను అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వైరల్ చేసినవారి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.