‘ప్రేమమ్’ సినిమా హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో అలజడి మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, లైంగిక వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో సంచలనం బయటికొస్తోంది.
తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి గత నవంబరులో దుబాయ్‌కి తీసుకెళ్లారని, అక్కడ తనను లైంగికంగా వేధించారని సదరు నటి ‘ప్రేమమ్’ చిత్ర హీరో నివిన్ పౌలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు నివిన్ పౌలి సహా ఆరుగురిపై నాన్–బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒక నిర్మాత కూడా ఉండటం గమనార్హం.
నివిన్‌పై కేసు నమోదైన విషయం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకూ నివిన్ సుపరిచితుడే. ’ప్రేమమ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివిన్.. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. ఈ ఏడాది ’మలయాళీ ఫ్రమ్ ఇండియా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా.. కేరళ ప్రభుత్వం కూడా హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో దీనిపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
నివిన్ స్పందన ఇదే..
ఈ వ్యవహారంపై నివిన్ భిన్నంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని చెప్పారు. తాను ఓ అమ్మాయి విషయంలో అసభ్యంగా ప్రవర్తించానంటూ వచ్చిన తప్పుడు కథనం తన దృష్టికి వచ్చిందని, అది పూర్తిగా అవాస్తవమని పునరుద్ఘాటించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు ఎంతవరకైనా వెళతానని, జరగాల్సింది లీగల్‌గానే జరుగుతుందని వివరించారు.