గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంతోపాటు, విద్యా విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. అందులో ప్రధానమైనది SSC బోర్డ్ పరీక్షలు రద్దు చేయడం. టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నుంచి CBSE సిలబస్ చదివి, ఆ ప్యాట్రన్ లోనే పరీక్షలు రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. ఈ ఏడాది వరకు SSC బోర్డ్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
CBSE ఎందుకు వద్దు..?
మొదటినుంచీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే CBSE సిలబస్, పరీక్షలపై కూడా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సడన్ గా CBSE పరీక్షలు వద్దు SSC బోర్డ్ పరీక్షలు నిర్వహిద్దాం అంటే కుదరదు కదా. అందుకే ఓ పద్ధతి ప్రకారం ముందు గా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. CBSE సామర్థ్యాలు ఎవరికీ లేవు అని నిర్థారించి ఆ పద్ధతిని పక్కనపెట్టారు.
ప్రస్తుతం వెయ్యి ప్రభుత్వ CBSE స్కూల్స్ లో 77,478 మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు. ప్రయోగాత్మకంగా ఈ వెయ్యి స్కూల్స్ కి CBSE గుర్తింపు తీసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానం మార్చాలని చూశారు. గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇటీవల టెన్త్ క్లాస్ విద్యార్థులకు CBSE మోడల్ పరీక్షలు నిర్వహించారు. అందులో 64 శాతం అంటే 49,410 మంది ఫెయిలయ్యారు. 326 స్కూల్స్ లో కనీసం ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఈ రిజల్ట్ ని చూపిస్తూ కొత్త ప్రభుత్వం CBSE విధానాన్ని పక్కనపెట్టింది.
ఒకరకంగా విద్యార్థులకు ఇది ఊరట అనే చెప్పాలి. CBSE ప్యాట్రన్ కి వారు ఇంకా అలవాటు పడలేదు. CBSE రాస్తున్న ఫస్ట్ బ్యాచ్ కావడంతో ఆందోళనలో ఉన్నారు. టీచర్లకు కూడా సరైన శిక్షణ లేదని అంటున్నారు. ఈ దశలో SSC బోర్డ్ పరీక్షలకే ప్రభుత్వం మొగ్గుచూపడం విశేషం.