కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనలు ఇంకా కొనసాగుతుండగానే.. ఓ ఆస్పత్రిలో నర్సుపై సామూహిక అత్యాచారానికి యత్నించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ దారుణానికి యత్నించింది ఓ డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు సహాయకులు కావడం గమనార్హం. ఈ క్రమంలో తనను కాపాడుకునేందుకు బాధిత నర్సు పదునైన బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలను కోసేసి అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో గల ఆర్‌బీఎస్ హెల్త్ కేర్ సెంటర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హెల్త్ కేర్ సెంటర్‌లో పనిచేస్తున్న నర్సు నైట్ డ్యూటీలో ఉండగా.. డాక్టర్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్‌కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో నర్సు పదునైన బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చి పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించింది.
వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు డాక్టర్‌తో పాటు మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో డాక్టర్, ఇతర నిందితులు మద్యం మత్తులో ఉన్నారు. అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆస్పత్రికి ప్రధాన ద్వారానికి లోపలి వైపు నుంచి తాళం వేసి, సీసీ టీవీలను ఆపేసినట్టు డీఎస్పీ సంజయ్‌కుమార్ పాండే తెలిపారు. ఆస్పత్రిలో మద్యం బాటిల్, బ్లేడ్, రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నర్సు చాలా ధైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకోవడంపై ఆమెను డీఎస్పీ ప్రశంసించారు.