మొదటి తారీఖు వచ్చింది. కానీ పింఛన్లు రాలేదు. వలంటీర్లు రాలేదు. పింఛన్లు ఇవ్వలేదు. ఇది ప్రస్తుతం పెన్షన్ లబ్ధిదారుల పరిస్థితి. ప్రతి నెలా మొదటి తారీఖు రాగానే వచ్చి ఆప్యాయంగా పలకరించే వలంటీర్లు ఈ నెల రాలేదు. చేతికి డబ్బులు రాకపోవడంతో సరుకులు, మందులు కొనే పరిస్థితి లేక పింఛనుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పింఛన్లు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుటెండల్లో బ్యాంకులకు వెళ్లలేక వృద్ధులు, దివ్యాంగులు కష్టాల పాలవుతున్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన కుట్రల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించవద్దని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబుకు కొమ్ము కాసే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగా వలంటీర్లను విధులకు దూరం చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వలంటీర్లు దూరం కావడంతో గత నెల పింఛన్ల పంపిణీలో తీవ్రమైన అవాంతరాలు ఏర్పడ్డాయి.
వృద్ధులు, దివ్యాంగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఎండల తీవ్రతకు దాదాపు 32 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు చేసిన కుట్రల వల్లనే తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వృద్ధులు, దివ్యాంగులు మండిపడుతున్నారు. నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా, వివక్ష చూపకుండా వలంటీర్లు ప్రతి ఇంటికీ వచ్చి పింఛన్లు అందించేవారు.
వలంటీర్ వ్యవస్థ వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుండడంతో ఓర్వలేక టీడీపీ కుట్రలు చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్ అందించే పలు సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శిస్తున్నారు. పేదలకు మంచి జరుగుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.
రెండు నెలల పాటు తాము ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత జగన్ వస్తే మునుపటి పరిస్థితి వస్తుందనే భావన వారిలో నెలకొందని, అందువల్ల ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో జగన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.