గ్రేటర్ హైదరాబాద్‌లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టుచిక్కలేదు. రాష్ట్రమంతా హవా సాగించి, అధికారంలోకి వచ్చినా హైదరాబాద్‌లో పట్టు దొరక్కపోవడంతో రేవంత్‌రెడ్డి నగరంలో ఆపరేషన్ బీఆర్ఎస్‌కు తెర తీశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మొదలుపెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు వచ్చారు. రోజుకో నేత గాంధీభవన్ గేటు ముందు వాలిపోతుండటం బీఆర్ఎస్ నాయకత్వంలో గుబులు రేపుతోంది.
దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి!brs-mla-danam-nagender
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిన్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌కు పాత కాపే అయిన దానంని సొంత గూటికి రమ్మని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. దీనికి దానం సుమఖంగానే ఉన్నారు. అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ చేయందుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని అధిష్ఠానం అడిగితే తాను సిద్ధంగా లేనన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో నలుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు
వీరితోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కారు దిగి, చేయి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ మూలాలున్న ఎమ్మెల్యేలపై దృష్టి పెడుతున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వంటి వారంతా గతంలో కాంగ్రెస్ పక్షులే. ఆ పరిచయాలతో కాంగ్రెస్ నేతలు వీరినే సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి గ్రేటర్‌లో పట్టు పెంచుకోవడానికి కాంగ్రెస్ ఆపరేషన్ బీఆర్ఎస్‌ను వేగవంతం చేస్తోంది.