ఎన్నికల బరిలో ఒక హీరోలా నిలబడ్డానని ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఆ మాటన్నారు. అవతలి వైపు అందరూ మోహరించి తనను ఎదుర్కుంటున్న పరిస్థితిలో ఒక్కడై ఆయన ఎదురొడ్డుతున్నారు. అందువల్ల వైఎస్ జగన్‌ను హీరోగానే చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి వచ్చినా, చంద్రబాబు బీజేపీ, జనసేనలతో కలిసి వచ్చినా వారంతా ఒక్కటేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ముఖాముఖి పోటీ మాత్రమే ఉందని ఆయన తరుచుగా అంటూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఒక్కడిని ఎదుర్కోవడానికి నలుగురు ఒక్కటయ్యారు. ఆరు పార్టీలు కలిసి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాయి. అయినా కూడా తొట్రుపాటు లేకుండా వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనకు ప్రయోజనం కలుగుతుందని భావించి కాంగ్రెస్ నుంచి షర్మిలను రంగంలోకి దించారు. కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు జగన్‌పై పోరాటానికి సిద్ధపడ్డాయి. మొత్తంగా ఆరు పార్టీలు ఒక్కడి మీద పోరాటానికి దిగుతున్నాయి.
జగన్ ఒక్కడు ఒకవైపు ఉంటే, మిగతా అన్ని పార్టీలూ మరో వైపు ఉన్నాయి. అయినా కూడా ప్రతిపక్షాలకు జగన్‌ను ఓడిస్తామనే నమ్మకం కుదిరినట్లు లేదు. మరీ ముఖ్యంగా ఎల్లో మీడియాకు కూడా ఆ నమ్మకం లేనట్లు ఉంది. అందుకే నిత్యం వైఎస్ జగన్ సర్కార్ మీద బురద చల్లుతున్నాయి. జగన్‌ను గద్దె దించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి ఆ పార్టీలన్నీ ఎందుకు వచ్చాయనే విషయాన్ని పరిశీలిస్తే సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలన్నీ వైఎస్ జగన్ వెంట ఉన్నాయి. అందుకే జగన్ వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని అన్నాడు. జగన్ ముందు చూపుతో అమలు చేస్తున్న పథకాలను అందుకున్న కుటుంబాలు ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు జగన్ ప్రభుత్వం ద్వారా ఏదో రకంగా ప్రయోజనం చేకూరుతోంది. దాంతో జగన్ రాష్ట్రంలో బలమైన నాయకుడిగానే కాకుండా ప్రజలకు నచ్చిన నాయకుడిగా కూడా ఎదిగారు.
జగన్ అమలు చేసిన పథకాలను కొనసాగిస్తామని అంటూ మరిన్ని పథకాలను కూడా టీడీపీ, జనసేన ప్రకటించాయి. వలంటీర్ల వ్యవస్థపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ తర్వాత నాలుకలను మడతపెట్టారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. గతంలో మాదిరిగా పైరవీలు చేసుకునే కష్టాల నుంచి వారు బయటపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను తప్పు పడితే ప్రజలందరూ వ్యతిరేకమవుతారనే భయంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ మాటలను వెనక్కి తీసుకున్నారు. మొత్తం మీద, జగన్‌ను ఎందుకు గద్దె దించాలో చెప్పడానికి కూడా ప్రతిపక్షాల వద్ద కారణాలు లేవు.