పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటివరకు ఈయన ఎక్కడ ఒక చోటు కూడా విజయం సాధించలేకపోవడం గమనార్హం. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే కేటాయించారు. 24 ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లను ప్రకటించారు.
ఈ విధంగా జనసేన పార్టీ నుంచి 24 ఎమ్మెల్యే సీట్లు రావడంతో సొంత సామాజిక వర్గంలో కూడా పవన్ పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఈయన ప్యాకేజీకి అమ్ముడుపోయారని జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టారని అందుకే 24 సీట్లు మాత్రమే తెచ్చుకున్నారు అంటూ ఎన్నో విధాలుగా పవన్‌పై విమర్శలు వచ్చాయి. ఇలా తన గురించి విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ 24 సీట్లను మాత్రమే తీసుకోవడానికి గల కారణాలను ఇటీవల తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా బహిరంగ సభలో వెల్లడించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను 24 సీట్లు తీసుకోవడానికి కారణం లేకపోలేదని చెప్పారు. ఎన్నికలలో ఖర్చు చేయగల అభ్యర్థులు ఎవరైనా తమ పార్టీలో ఉన్నారా? పోలింగ్ బూత్‌కు 1000 మందిని తీసుకువచ్చే కార్యకర్తలు ఉన్నారా? వైసీపీ స్టామినాని తట్టుకొని నిలబడగల అభ్యర్థులు ఉన్నారా? వీటి గురించి ఆలోచించే తాను 24 సీట్లు తీసుకున్నానని పవన్ చెప్పకనే చెప్పేశారు.
ఇక ఇదే విషయం గురించి పలువురు అధికార మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 137 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మాత్రం కేవలం 24 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. గతంలో పోలిస్తే ఇప్పుడు పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయినప్పటికీ ఈయన 24 సీట్లను మాత్రమే తీసుకోవడం వెనక అర్థం ఏంటి? రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా ఉండడం కోసమే పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు గ్రామ స్థాయిలో కమిటీలు వేయలేదు అంటే అర్థం ఏంటి? గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఒక కమిటీ కూడా వేయలేదు ఇలా వేయకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అసమర్థతేనని, రాజకీయంగా పవన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరేదిలేదని చెప్పాలి.