దాదాపు వారం రోజుల క్రితం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితమైనప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనని తాను వామనుడితో పోల్చుకున్నారు. పార్టీ మీటింగులో పిచ్చిమాటలు చాలానే మాట్లాడారు. 24 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారని అడిగినవారికి గాయత్రి మంత్రంలోని అక్షరాల సంఖ్య గురించి చెప్పారు. పవన్ చెప్పింది పిచ్చిమాటలే అని అందరికి అర్థమైపోయింది. అంతటితో ఆగకుండా మూడు పార్లమెంటు సీట్లు తీసుకున్నందుకు వామనుడిలా జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కేస్తానని హూంకరించారు. దీంతో పవన్‌కు పురాణాలు కూడా సరిగా తెలియవని అర్థమైపోయింది.
గాయత్రి మంత్రమని, వామనుడని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను సభలో చదివేశారు. నిజానికి వామనుడు ఎవరిని పాతాళంలోకి తొక్కారంటే తనకు దానమిచ్చిన బలి చక్రవర్తిని. మరిక్కడ వామనుడు ఎవరు? బలిచక్రవర్తి ఎవరు? సీట్లిచ్చింది చంద్రబాబు అయితే తీసుకుంది పవన్. కాబట్టి సీట్లిచ్చిన చంద్రబాబునే పవన్ పాతాళంలోకి తొక్కేయాలి. మధ్యలో జగన్ పిక్చర్లోకి ఎలా వచ్చారు? దానం చంద్రబాబు దగ్గర తీసుకుని జగన్‌ను పాతాళంలోకి తొక్కేస్తానని పవన్ అనటంలో అర్ధమేలేదు.
అంటే తనను తాను వామనుడంతటి శక్తిమంతుడనని పవన్ భ్రమల్లో బతుకుతున్నారని అర్ధమవుతోంది. అయితే వారంరో జులు అయ్యేటప్పటికి వామనుడు పోస్టు కూడా ఊడిపోయింది. ఎందుకంటే వీళ్ళ కూటమిలోకి బీజేపీ చేరింది. మూడు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటులో జనసేన నుండి బీజేపీ సీట్లు లాగేసుకుంది. బీజేపీ పోటీ చేయబోతున్న 10 ఎమ్మెల్యే స్థానాల్లో మూడింటిని జనసేన నుండే లాక్కున్నది. అలాగే మూడు ఎంపీ సీట్లలో ఒకదాన్ని జనసేన నుండే తీసుకుంది. పవన్‌కు చంద్రబాబు సీట్లు దానమిచ్చినట్లు జనసేన నుండి బీజేపీ దానం తీసుకోలేదు. ఏకంగా మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును లాగేసుకుంది.
విచిత్రం ఏమిటంటే టీడీపీ కోటాలో నుండి బీజేపీకి సీట్లు ఇవ్వకుండా జనసేనకు ఇచ్చిన సీట్లలో చంద్రబాబు కోతపెట్టడం. ఇక్కడ అర్థమవుతుంది ఏమిటంటే పవన్‌కు సీట్లు ఇచ్చే విషయంలో, తర్వాత బీజేపీకి సీట్లు సర్దుబాటు చేసే విషయంలో కూడా పవన్‌ను చంద్రబాబు తొక్కేశారని. చంద్రబాబు తొక్కుడికి తాను పాతాళంలోకి వెళ్లిపోతూ.. ఎదురు తానే వామనుడినని భ్రమల్లో బతుకుతుండటమే పవన్ అజ్ఞానానికి నిదర్శనం.