టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన స్థానాలు కేవలం 24.. వాటిలో ఐదు స్థానాలకు పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అసలు మిగతా 19 స్థానాలు ఏవో పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఉందా, లేదా అనేది అనుమానంగా ఉంది. జనసేనకు కేటాయించే స్థానాలను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు లేదు. ఖరారు చేసి ఉంటే పవన్ కల్యాణ్ వాటికి అభ్యర్థులను ప్రకటించకపోయినా తమ పార్టీ పోటీ చేసే స్థానాలనైనా ప్రకటించి ఉండేవారనే మాట వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ తమ పార్టీ పోటీ చేసే స్థానాలపై, ఆ స్థానాల్లో పోటీకి దింపే అభ్యర్థులపై కసరత్తు చేసినట్లు కనిపించడం లేదు. చంద్రబాబు మాత్రం పక్కా ప్రణాళికతో అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించే సమయంలో పవన్ కల్యాణ్ తేలిపోయినట్లు కనిపించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ పదే పదే చెప్పుతున్న పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రణాళికాబద్దంగా నడిపిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. అసలు పవన్ కల్యాణ్‌కు జనసేన నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల పార్టీ ఇంత దిగదిడుపుగా ఉండడం ఆశ్చర్యకరమే.