తిరుమల లడ్డూ వివాదంపై తనదైన శైలిలో మరోసారి స్పందించారు పవన్ కల్యాణ్. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ట్వీట్ చేశారు. అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని తన ట్వీట్ లో పేర్కొన్నారు పవన్. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని, ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం అని అన్నారు పవన్.
https://x.com/PawanKalyan/status/1837500828497654099
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పేర్కొన్నారు పవన్. అపరాధ భావానికి గరయ్యానని, ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి క్లేశం దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని చెప్పారు. అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానన్నారు పవన్.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానన్నారు పవన్. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని చెప్పారు. దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని తనకివ్వమని వేడుకుంటానన్నారు పవన్.
తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం బాధాకరం అన్నారు పవన్. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారేమో అనిపిస్తోందన్నారు. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందన్నారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందంటూ ట్వీట్ వేశారు పవన్.