ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. రాజమండ్రి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై అనిర్దిష్టమైన వ్యాఖ్యలు చేశారే తప్ప రాష్ట్రానికి మేలు చేసే అంశాలను తడమలేదు. ముస్లిం మైనారిటీలకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చెలరేగిపోతోందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, దండిగా అప్పులు చేశారని విమర్శించారు. అయితే, ఆయన జగన్ పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పిన విషయాలనే ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిత్యం అవే విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదన్నారు. మూడు రాజధానుల అమలుకు టీడీపీ అడ్డుపడుతున్న విషయం ఆయనకు తెలుసో లేదో.
ముస్లిం మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో కొనసాగుతాయని మోదీ చెప్పలేదు. ఆ విషయం ఆయన చెప్పరు. ఎందుకంటే, ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి చాలా సార్లు ఇప్పటికే చెప్పారు. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదనేది బీజేపీ విధానం. ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఏ విధమైన హామీ ఇవ్వలేరనేది స్పష్టం.
ఇక సీఏఏను గానీ, యూసీసీని గానీ ప్రస్తుత రూపంలో అమలు చేయబోమని కూడా ఆయన చెప్పలేదు. ఈ అంశాలపై ముస్లిం మైనారిటీల్లో ఉన్న భయాందోళనలను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఈ రెండు అంశాల విషయంలో బీజేపీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల మోదీ ఏ విధమైన హామీ ఇవ్వలేరు. వాటిని ప్రస్తుత రూపంలో అంగీకరించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. యుసీసీకి, సీఏఏకు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ స్థితిలో ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు ఏ విధమైన భరోసా కలిగించగలరని ప్రశ్నిస్తే ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గానీ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని గానీ మోదీ హామీ ఇవ్వలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వెనక్కి తీసుకుంటామని కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. దానికి వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలు చేయడానికి పూనుకుంది. ఈ రకంగా చూస్తే, నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే చేసే మంచి పనులేమిటో నిర్దిష్టంగా కొన్నయినా ప్రధాని చెప్పి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.