టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్న వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు వారంతా తమ పాస్ పోర్ట్ లను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అందజేశారు. విచారణలో భాగంగా పోలీసులు వారికి పలు ప్రశ్నలు సంధించారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయి, ప్రస్తుతం గుంటూరు జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే కేసులో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్.. సుప్రీంకోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. 48 గంటల్లో పాస్ పోర్టులు పోలీసులకు అందజేయాలని, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని వారికి న్యాయస్థానం సూచించింది. దీంతో ఈరోజు వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు, పాస్ పోర్ట్ లు అందజేశారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు.. వారిని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి ఘటనలో వివరాలు సేకరిస్తున్నారు. వారి పాత్ర ఏంటని ఆరా తీస్తున్నారు.
టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిలో తాము ప్రత్యక్షంగా పాల్గొనలేదని వైసీపీ నేతలు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినందుకే కొంతమంది కోపంతో ఆఫీస్ పై దాడి చేసిన విషయం తమకు తెలుసని, అయితే తామెక్కడా దాడుల్ని ప్రోత్సహించలేదని, దాడుల్లో పాల్గొనలేదని వారు వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కూటమి ప్రభుత్వం పాత కేసుని తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు వినపడుతున్నాయి.