తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ తిరుగుబాటు ప్రకటించారు. విజయవాడ పశ్చిమ సీటు నుంచి తాను పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. తనకు పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ సీటును బీజేపీకి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ సీటు తమ పార్టీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్యెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ శాంతియుతంగా మహా ధర్నా చేపట్టారు.
తనకు పవన్ కల్యాణ్ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని, ఇంటికి పిలిచి మరీ పని చేసుకోవాలని సూచించారని ఆయన అన్నారు. ప్రతి డివిజన్‌లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించామని, తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు పొత్తు పేరుతో బీజేపీకి ఆ సీటు ఎలా ఇచ్చారని, గెలిచే సీటు తీసికెళ్లి వాళ్ల చేతుల్లో పెట్టారని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్న ఈ సీటులో బీజేపీ గెలుస్తుందా అని ఆయన అడిగారు.
పార్టీ క్యాడర్ మొత్తం తీవ్ర నిరాశలో ఉందని, తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా తమ అధినేతకు ఇస్తానని, లేదంటే ఇదే పవన్ కల్యాణ్ ఫొటోతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ పోటీలో ఉంటాడని, మరొక్కసారి అధిష్టానం ఆలోచన చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.