వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అందుకు తన విశ్లేషణను కూడా అందించారు. అందులో ప్రధానమైంది, జగన్ ప్రొవైడర్ పాత్రను మాత్రమే పోషిస్తున్నారని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన చెప్పారు. అయితే, జగన్ పనితీరు ఆయనకు కూడా అందలేదనేది దీన్నిబట్టి అర్థమవుతోంది. బటన్ నొక్కి నగదును పంచినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ కేవలం బటన్ నొక్కి నగదును పంచడం మీదనే పూర్తిగా ఆధారపడలేదనేది ప్రశాంత్ కిశోర్‌కు అర్థం కాలేదు. అది ఆయన పరిశీలనకు అందలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారనేది, ప్రశాంత్ కిశోర్ ముసుగును తొలగించుకున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అందులో నిజం ఉండవచ్చు. అయితే, ప్రశాంత్ కిశోర్ ఇంత కాలంగా పనిచేస్తున్న తీరును చూస్తే ఆయన మాటలకు కొంత విలువ ఉంటుంది. దాని కారణంగానే చంద్రబాబు ఆయనతో మాట్లాడించారని భావించడంలో తప్పు లేదు. కానీ ఆయన విశ్లేషణ, అంచనా తప్పు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
జగన్ కేవలం సంక్షేమ పథకాలను అందించడం వద్దనే ఆగిపోలేదని ఆయనకు అర్థం కాలేదు. వాటిని అందించడంలో ఆయన అనుసరిస్తున్న విధానం ఇప్పటి వరకు ఎక్కడా జరిగింది కాదు. సంక్షేమ పథకాలను అందుకోవాలంటే లబ్ధిదారులు గతంలో ఎంతగా యాతన పడేవారో, ఎవరెవరి ప్రాపకం కోసం రోజుల తరబడి కష్టపడాల్సి వచ్చేదో, తమకు అందే ప్రయోజనంలో ఇతరులకు ఎంత ముట్టజెప్పాల్సి వచ్చేదో, కాళ్లు అరిగేలా ఎలా తిరగాల్సి వచ్చేదో అనుభవంలో ఉన్నదే. అర్హత గలవారిలో ఎంత మందికి అవి అందుబాటులోకి రాలేదో లెక్కలు లేవు. ఇప్పుడు వలంటీర్ల ద్వారా అందిస్తున్న పథకాలు, బటన్ నొక్కి నగదును జమ చేస్తున్న తీరు లబ్ధిదారుల్లో జగన్ పట్ల ఏ స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించిందనేది ప్రశాంత్ కిశోర్ విశ్లేషణకు అందేది కాదు. సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన విజయం సాధించలేరని ఆయన చెప్పడంలోని లోపం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
సంక్షేమ పథకాలను అందించడంతో పాటు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో, చెప్పాలంటే గ్రామ స్థాయిలో ఆయన పట్ల సానుకూల ధోరణి ఏర్పడడానికి ఆ సోషల్ ఇంజనీరింగ్ కారణం. వలంటీర్ వ్యవస్థను చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భయపడడం, ఎల్లో మీడియా వలంటీర్లపై దుమ్మెత్తిపోయడం, నాలుగైదు చోట్ల వలంటీర్లు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థకే దాన్ని అంటగట్టడం ఇంత కాలం చేశారు. ఇప్పుడు వారిని చంద్రబాబు దువ్వుతున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎంత పటిష్టంగా, సక్రమంగా పనిచేస్తున్నదీ, వారి పనితీరు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని నిరుపేదల్లో, రాష్ట్రంలోని మహిళల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఎంత అభిమానంతో ఉన్నదీ చంద్రబాబు మాటల ద్వారానే అర్థమవుతోంది. ఇదంతా జగన్‌కు వచ్చే ఎన్నికల్లో కలిసి రాదని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారని అనుకోవాలి.
ఇక ఆయన మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక చలనశీల ప్రక్రియ ఎలా జరిగిందనేది ప్రశాంత్ కిశోర్‌కు అర్థం కాలేదు. రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఒక సామాజిక వర్గం ప్రాబల్యం, ఆధిపత్యం వల్ల మిడిల్ క్లాస్ కూడా తీవ్రంగానే ప్రభావితమైంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పట్టణ ప్రజలు, గ్రామీణులు చిక్కులు ఎదుర్కున్నారు. కాల్‌మనీ వంటి ఉదంతాలు, స్థానిక నాయకుల భుజబలం మధ్యతరగతి ప్రజలను ఇబ్బందిపెట్టాయి. ఇది జగన్ ప్రభుత్వ హయాంలో కనిపించడం లేదు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ తమ జీవితాల్లో ప్రశాంతతను కోరుకుంటుంది. అటువంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. అందువల్ల ప్రశాంత్ కిశోర్ ఆలోచనలు లోతుల్లోకి వెళ్లి చెప్పినవి కాదనేది తెలిసిపోతుంది. చెదురుమొదురు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని మొత్తం సమాజానికి అంటగట్టలేం.
విద్యారంగంపై, వైద్య ఆరోగ్య రంగంపై పెట్టిన శ్రద్ధ జగన్ దార్శనికతను ప్రతిబింబిస్తాయి. మనబడి నాడు-నేడు, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పలు పథకాలు సమాజంలో తెస్తున్న మార్పును కూడా చూడాల్సి ఉంటుంది. వైద్యరంగానికి వస్తే, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వాటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్న తీరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడలేదు. ఇవి సమాజంలో గుణాత్మకమైన మార్పునకు దోహదం చేస్తున్నాయి. లబ్ధిదారుల్లో సంతృప్తిని కలిగిస్తున్నాయి. అవి జగన్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేవే.
రాజకీయ రంగంలో కూడా ఆయన తీవ్రమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయాధికారానికి చేరువ చేస్తున్నారు. ప్రభుత్వంలో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. అందుకు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయినవారిని కూడా జగన్ దూరం పెట్టేందుకు వెనకాడడం లేదు. రెడ్ల ప్రాబల్యానికి ఒక రకంగా ఆయన గండికొడుతున్నారు. ప్రజలకు దూరంగా ఉంటూ పాత పద్ధతిలో రాజకీయాలు చేయాలనుకుంటున్నవారిని ఆయన వదిలేస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడేదే.
కేసీఆర్ గురించి చెప్పాల్సి వస్తే..
తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్ కిశోర్ శాసనసభ ఎన్నికలకు ముందు చెప్పారు. ఆయన అంచనా తప్పింది. అయితే, తన అంచనా తప్పడానికి గల అసలు కారణాలను ఆయన గుర్తించినట్లు లేదు. కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారని, అవి ఎన్నికల్లో ఆయనను గెలిపించలేకపోయాయని ఆయన ఇప్పుడు అంటున్నారు. అందువల్ల జగన్ ఓడిపోతారని ఆయన చెప్పుతున్నారు. అయితే, కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన అధ్యయనం చేసినట్లు లేదు. ఒక్క పథకం కూడా ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా అమలైన దాఖలా లేదు.
తమకు అందాల్సిన ప్రయోజనం కోసం అధికారుల చుట్టో, స్థానిక నాయకుల చుట్టో, పైరవీకారుల చుట్టో తిరగాల్సిన పాత పద్ధతినే కేసీఆర్ కొనసాగించారు. ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు కదలకుండా సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు అందుకోలేకపోయారు. సంక్షేమ పథకాలు పార్టీలను గెలిపించలేవనే వాదన ఇక్కడ నిజమవుతుంది. కానీ ఏపీలో నిజం కాదు.
రైతుబంధు కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేయలేదు. కొద్దిమంది సంపన్నులు, సెలిబ్రిటీలు, ఎన్నారైలు రైతుబంధులో ప్రధాన వాటాను అందుకున్నారు. చిన్నరైతులు, వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతులకు మేలు జరిగినప్పటికీ అది అంత సంతృప్తిని కలిగించలేకపోయింది. కౌలు రైతులను ఆయన వదిలేశారు. దళిత బంధు పరిస్థితి కూడా అంతే. హడావిడిగా ప్రవేశపెట్టిన ఈ పథకం కేసీఆర్‌కు ఉపయోగపడలేదు. దానికీ ఆ పథకంలోని లోపాలు, అది అమలైన తీరు కారణమని అధ్యయనం చేస్తే తెలిసిపోతోంది.
మరో విషయం… కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారమనేది బీఆర్ఎస్ ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఒక్కటి. గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు జరిగిన భూకబ్జాలు, వాటి సెటిల్మెంట్లు కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణం. పథకాల అమలు తీరుపై గానీ పైనుంచి కింది స్థాయి వరకు బీఆర్ఎస్ నేతల పనితీరుపై గానీ కేసీఆర్ చెక్ పెట్టలేదు. గొర్రెల పంపకంలో జరిగిన అవినీతి, విచ్చలవిడితనం అన్ని విషయాల్లో జరిగాయని చెప్పడానికి బహుశా ఇంకా కొంత పరిశీలన అవసరం కావచ్చు. కానీ లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా తెలంగాణలో సంతృప్తికరమైన స్థాయిలో ఫలితాలను పొందలేదనేది మాత్రం సత్యం. అందువల్ల తెలంగాణలోని ఎన్నికల ఫలితాలే ఆంధ్రప్రదేశ్‌లో వస్తాయనే ప్రశాంత్ కిశోర్ అంచనా తప్పు అవుతుందని భావించవచ్చు. అభ్యర్థులను మారిస్తే బీఆర్ఎస్ గెలిచి ఉండేదనేది అది పైపైన చూసి చెప్పే మాటనే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రీత్యా తెలంగాణ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. సామాజిక అభివృద్ధిలో ఏపీ ముందు ఉంది. కానీ, తెలంగాణలో మాదిరిగా ప్రజలు ఇప్పటి వరకు చైతన్యవంతులు కాలేదు. ప్రజాసమస్యలపై పోరాటం చేసే స్వేచ్ఛ గానీ, ఉత్తమమైన పౌర సమాజం గానీ లేవు. దానికి ప్రధాన కారణం అక్కడి రాజకీయాలు. రెండు సామాజిక వర్గాల ఆధిపత్యంలో నడిచిన రాజకీయాల వల్ల, ఆ వర్గాలు అనుసరించిన అణచివేత చర్యల వల్ల అది సాధ్యపడలేదు. దళిత సంఘాలు, విప్లవ సంఘాలు, ఇతర ఉపశ్రేణుల ఉద్యమాలు తెలంగాణలో బలంగా ఉండడానికి కారణం నిజాం ప్రభుత్వ పాలన నుంచి నడిచిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కారణం. ఇది కూడా కేసీఆర్ ఓటమికి ఒక కారణం. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ ధోరణులపై కూడా తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారని అనుకోవాలి.
అటువంటి ఉద్యమాలు స్వాతంత్య్రకాలంలో జరిగినట్లు ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే. విరసం వంటి సంస్థల కార్యకలాపాలు ఎక్కువగా తెలంగాణలోనే కేంద్రీకృతం కావడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల అటువంటి సామాజిక మార్పులు కొద్ది సంవత్సరాల్లో ముందుకు వస్తాయి. ఇది జగన్ అనుసరిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వల్ల, విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల అది సాధ్యమవుతుంది.