అభివృద్ధి వనంలో వైఎస్ జగన్ గంజాయి మొక్క అని రామోజీరావు తన ఈనాడు పత్రికలో అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రచురించిన మర్నాడే విశాఖ తీరంలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలతో వచ్చిన కంటైనర్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో నిందితులైనవారికి టీడీపీ పెద్దలతో సంబంధాలున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే రామోజీరావు జగన్‌పై తిరిగేసి చెప్పినట్లు భావించవచ్చు. టీడీపీ గంజాయి వనంలో జగన్ తులసి మొక్క అని భావించకతప్పదు.
విశాఖ తీరంలో పట్టుబడిన మాదకవ్య్రాల వ్యవహారంపై రామోజీరావుకు చెందిన ఈనాడు ప్రచురించిన వార్తాకథనంలో పలు వక్రీకరణలున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే వ్యాఖ్యలు చేస్తూ అసలు నిందితుల గుట్టు విప్పకుండా వార్తాకథనాన్ని నడిపించారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా వక్రీకరణలకు తావు కల్పించారు.
‘‘రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించింది. దానికి బానిసలుగా మారుతున్నవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ మాదకద్రవ్యాలు వ్యాప్తి చెందుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు. గంజాయిని అదుపు చేయడానికి జగన్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. కానీ దొంగచాటుగా కళ్లు గప్పి మాదకద్రవ్యాలను విశాఖ తీరం చేర్చిన తాజా సంఘటన వాస్తవంగా రామోజీరావుకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, ఈ వ్యవహారంతో టీడీపీ నేతల ప్రమేయం వెలుగు చూస్తోంది. దీనికి కూడా జగన్ కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని వార్తకు ఓ వ్యాఖ్యానాన్ని చేర్చారు. ఇదేం దిక్కుమాలిన వ్యక్తీకరణో రామోజీరావు చెప్పాలి.
రామోజీరావు తెలివి తెల్లారినట్లే ఉంది. అన్నింటినీ జగన్‌కే అంటగట్టడం అలవాటైన రామోజీరావు తాజా సంఘటన విషయంలోనూ అదే ‘ సంప్రదాయాన్ని’, ‘విలువ’ను పాటించారు. విశాఖ పోర్టుకు ఈ నెల 16న చేరిన కంటెయినర్‌ను తెరిచేందుకు సీబీఐకి ఆటంకాలు కలిగించినట్లు తెలుస్తోందట. రూ. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరక్కుండా అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నించారట. వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటెయినర్‌ను తెరవకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోందని అన్నారు. అంతా తెలుస్తోందే! రామోజీరావుకు చంద్రబాబు సెన్స్ ఉంది. అందుకే ఆ విధంగా అన్ని విషయాలూ తెలుస్తున్నాయి.
వాస్తవాలు బయటపడిన తర్వాత కంటెయినర్‌ను తెరవకుండా ఒత్తిళ్లు తేవాల్సిన అవసరం ఎందుకు ఉందో రామోజీరావు గుర్తిస్తారని భావించడానికి వీలుందా? మెల్లగా దాన్ని తొక్కిపట్టే ప్రయత్నాలను సాగిస్తారని వేరుగా చెప్పాల్సిన పని లేదు.
ఈనాడు రామోజీరావు బాటలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నడుస్తారని విడిగా చెప్పాల్సిన పని లేదు. తెర వెనుక వైసీపీ పెద్దలున్నారని అనుమానాలు కలుగుతున్నాయంటూ వార్త రాసింది. తెరవెనక ఎవరు ఉండి ఉంటారో ఇప్పుడైనా ఆయన గ్రహిస్తారా? ఈ డ్రగ్స్ రాకెట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని, అందుకే కేసును మాఫీ చేయడానికి పోలీసు పెద్దల ద్వారా ప్రయత్నం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాధాకృష్ణ నొక్కి వక్కాణించే ప్రయత్నం చేశారు. ఇది ఆయనకు మామూలే. వైసీపీపైకి నెట్టేసి చేతులు దులుపుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.