జగన్ ప్రభుత్వంపై కత్తులు దువ్వడంలో రామోజీరావు ఎప్పుడూ ముందు వరసలో నిలపడి ఉంటారు. అర్థంపర్థం లేని తప్పుడు కథనాలు రాయించి తమ అక్కసు మొత్తం వెళ్లగక్కుతూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు జగన్‌ని దోషిని చేసి నిలపెడదామా అని తాపత్రయపడుతూ ఉంటారు. తాజా కథనంతో ఆయన దుర్భుద్ధి మరోసారి బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో కుట్రపూరితమైన వార్తా కథనాన్ని రాయించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కోసం ఆయన దారి తప్పి అవాస్తవాలను వెళ్లగక్కారు. ‘జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయి తెలుసా జగన్?’ అంటూ ఓ ప్రశ్నను సంధించారు. జాతీయ రహదారుల నిర్మాణం పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రామోజీ రాష్ట్రంపై కపట ప్రేమ చూపించారు. కానీ.. అసలు నిజం తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు ఎలా రాస్తారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే.. నిజానికి, జాతీయ రహదారుల నిర్మాణంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
సీఎం జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం రూ.71,200 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలో 3,770 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.40 వేల కోట్లు 2022-23లో కేటాయించారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై దృష్టి పెట్టింది. ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణనికి కేవలం రూ.13,353 కోట్లు ఖర్చు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ బెంజ్ సర్కిల్ పశ్చిమ, కనకదుర్గ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టలేక గాలికి వదిలేసింది. వాటిని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఆపేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం తుది దశలో ఉంది.
ముద్దనూరు ` బి. కొత్తపల్లి రహదారిని ప్రభుత్వం 2021-22లో రూ.1,020 కోట్లతో మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ తుదిదశలో ఉంది. 2022-23 వార్షిక ప్రణాళికలో ప్రభుత్వం మొత్తం 450 కిలోమీటర్ల మేర 9 రహదారుల నిర్మాణానికి రూ.7,809 కోట్లతో ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అనుమతి వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ 2023 నవంబర్ 10వ తేదీన నిర్వహించిన సమావేశం నిర్ణయించింది. 2017 తర్వాత ఆమోదించిన భారత మాల ప్రాజెక్టులకు 20 శాతం కన్నా ఎక్కువ నిధులు కేటాయించకూడదనే నిర్ణయం కూడా తీసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను ఆపేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ పనులను ఆపితే.. ఆ తప్పు జగన్ మీద తోయడం ఎంత వరకు న్యాయం. ఈ కథనాలతో.. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాస్తూ.. రామోజీ మరోసారి తన కుటిల బుద్ధిని చూపించుకున్నారు.