మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈ కేసులో ప్రధాన నిందితుడు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో కడప నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్‌రెడ్డికి పెద్ద రిలీఫ్ లభించినట్లయింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రధాన నిందితుడు దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. తాను సాక్షులను ప్రభావితం చేయట్లేదన్న అవినాష్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు బెయిల్ కొనసాగించింది.
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశంతోనే..
సిట్టింగ్ ఎంపీ అవినాష్ కడప ఎంపీగా వైసీపీ నుంచి మరోమారు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్షాలన్నీ కంకణం కట్టుకున్నాయి. అందుకే పనిగట్టుకుని షర్మిల అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వివేకా కూతుర్ని అక్కడ ప్రచారానికి పంపుతున్నారు. అయినా అవినాష్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణ, పార్టీ బలంతో ఆయన సునాయాసంగా గెలుస్తారని తెలిసి.. ఆయన్ను ఎన్నికల్లో తిరగకుండా చేయడానికే దస్తగిరితో బెయిల్ రద్దుకు పిటిషన్ వేయించారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో ప్రతిపక్షాల ఆటలు సాగలేదు.
భాస్కరరెడ్డికీ ఊరట
ఇదే కేసులో అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికీ ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగతా నిందితులు ఉదయ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.