రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాల అమలుపై చర్తిస్తారని సమాచారం. ఇంద్రవెల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఉచిత విద్యుత్తు పథకం కోసం మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలంటే మీ ఫోన్ నంబరు విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలి. మీరిచ్చిన నంబరుకు ప్రతినెలా కరెంటు బిల్లు పంపిస్తారు. కొందరి నంబర్లు లింక్ అయి లేకపోవడంతో మెస్సేజులు వెళ్లడంలేదని అధికారులు చెబుతున్నారు. నంబర్ లింకింగ్ కోసం కరెంట్ ఆఫీసులకే వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో కూడా ఫోన్ నంబరును అప్‌డేట్ చేసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం TSSPDCL యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని పట్టాలెక్కించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సకయ్యే పరిమితిని రూ.10లక్షలకు పెంచింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కంటే ముందే మరో రెండు పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.