టీడీపీ రూపొందించిన మేనిఫెస్టో మోసపూరిత హామీలతో నిండివుందని, దానిని నమ్మి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొంప కొల్లేరవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికి రూ.70 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా నెరవేర్చారని ఆయన చెప్పారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని అన్న బాబే టీడీపీ మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చారన్నారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లకుపైగా అవసరమవుతాయని చెప్పారు. అదనపు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు చెప్పడం లేదని ఆయన గుర్తుచేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏ హామీలోనూ స్పష్టత ఇవ్వరు..
ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, నిరుద్యోగులంటే ఎవరంటే స్పష్టత ఇవ్వరని సజ్జల చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటున్నారని, అర్హతలేమిటో చెప్పడం లేదని తెలిపారు. ఇలా బాబు ఇచ్చే ఏ హామీలోనూ స్పష్టత ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వస్తే అర్హతల పేరుతో కోతలు పెట్టి, ఎగ్గొట్టడం బాబుకు అలవాటేనన్నారు. అందుకే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఏకంగా మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని గుర్తుచేశారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తుందని, రాష్ట్రాలకు విడుదల చేయదని బాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలకు ప్రత్యేక మేనిఫెస్టోలను ఎలా ఇచ్చిందని సజ్జల ప్రశ్నించారు.
ఆ పాపం బాబుదే..
పింఛన్ల విషయంలో అవ్వాతాతలు పడుతున్న కష్టాల పాపం బాబుదేనని సజ్జల చెప్పారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నిప్పులకొలిమిగా మారుస్తానని దీని ద్వారా బాబు చెప్పకనే చెప్పారని గుర్తుచేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేస్తామని ప్రధాని మోదీతో చెప్పించగలరా అని సజ్జల నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భూములపై సర్వ హక్కులు కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రూపకల్పనకు 2019లో నీతి ఆయోగ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన ముసాయిదాను చట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. బాబు మాత్రం ఆ చట్టం ద్వారా సీఎం జగన్ భూములు లాగేసుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాక్ట్‌పై బాబు చేస్తున్న దుష్ప్రచారంపై బీజేపీ జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వం వాటి వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.