జమిలి ఎన్నికల అంశంపై ప్రస్తుతం చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ఆయన చెప్పారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ రాజ్యాంగ సవరణలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే సర్కారు వద్ద తగిన సంఖ్యాబలం లేదని చెప్పారు. ’ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనే విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలని మేమెందుకు కోరుకుంటాం?
రిజర్వేషన్లను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఇటీవల ప్రధాని మోడీ అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని చిదంబరం గుర్తుచేశారు. వాటిని రద్దు చేయాలని ఎందుకు కోరుకుంటామని ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని తాము చెబుతున్నామన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రాబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం అభ్యర్థి ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా సీఎం అభ్యర్థిని హైకమాండ్ ప్రకటిస్తుందని చెప్పారు.