ఒకప్పుడు వైఎస్ షర్మిల అంటే.. జగన్ సోదరి అనేవారు. ఆమె కూడా తనను తాను జగన్ వదిలిన బాణంగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు తన సొంత అన్ననే ఆమె టార్గెట్ చేస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ని షర్మిల టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. నిజానికి.. ఈ విషయంలో జరిగిన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోకుండా ఆమె జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అధ్యాయం ముగియడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.
చంద్రబాబే.. బీజేపీతో ఆ సమయంలో చేతులు కలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం అని చెప్పడంతో చంద్రబాబు కూడా సరే అని ఒప్పుకున్నారు. హోదాతో ఏమీ రాదు.. ప్యాకేజీతోనే ఎక్కువ ప్రయోజనం ఉందని అందరినీ నమ్మించారు. తీరా చూస్తే.. హోదా లేదు.. ప్యాకేజీ లేదు. రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడే ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసింది.
ఆ సమయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన హోదా ఇవ్వాలని చాలా పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూనే ఉన్నారు. అయితే, కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఏ విధమైన ఆందోళనలకు, ఒత్తిళ్లకు బీజేపీ దిగివచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకున్నప్పటికీ ఏం చేసినా ప్రత్యేక హోదాను సాధించే పరిస్థితి లేదు. కేంద్రంతో సఖ్యత లేకపోతే రాష్ట్రానికి వచ్చేది కూడా రాని పరిస్థితులు ఎదురు కావచ్చు. అందువల్ల ప్రత్యేక హోదాపై షర్మిల జగన్‌ను నిందించడంలో అర్థం లేదు.
ఇవేమీ తెలుసుకోకుండా.. షర్మిల.. తన అన్న జగన్‌ని ఇలా నిందించడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదాపై గానీ విభజన చట్టం హామీలపై గానీ ఏకతాటి మీదికి వచ్చే పరిస్థితి లేదు. జగన్‌ని విమర్శించడానికి అయినా అందరూ కలుస్తారు. కానీ.. ఈ విషయం గురించి మాట్లాడటానికి మాత్రం రాదు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. షర్మిల కూడా తెలుసుకుంటే మంచిది.