ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడే మేల్కున్నట్టున్నారు. వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టి ఇంకో నాలుగురోజులు గడిస్తే మూడు నెలలు. అయినా షర్మిల ఎందుకు ఇంత లేటుగా రియాక్ట్ అవుతున్నారనేది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లోనే హెల్త్ యూనివర్సిటీకి ఉన్న వైయస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టింది. గతంలో ఎన్టీఆర్ పేరు మీదున్న హెల్త్ యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం డాక్టర్ వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. అధికారంలోగానే మళ్లీ ఎన్టీఆర్ పేరునే హెల్త్ యూనివర్సిటీని నడుపుతాం అని గతంలో చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం.. అందుకు సంబంధించిన రిజల్యూషన్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభతో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది.
పథకాలకు పేర్లు మార్చడం తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఆనవాయితీగా వస్తున్నదే.. అయితే హెల్త్ యూనివర్సిటీకి వైయస్ఆర్ పేరు తొలగింపు అంశం ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చినట్లుంది. అందుకే హడావిడిగా ట్వీట్ చేస్తూనే, పనిలోపనిగా తన అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేశాడని చెల్లి షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి YSR పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందని షర్మిల అన్నారు.
NTR అయినా, YSR అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదు. YSR అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్, పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శం. YSR ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదు.. తెలుగు వారి ఆస్తి. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం. YCP మీద ఉన్న కోపాన్ని YSR మీద రుద్దడం సరికాదని చెబుతూనే, YCPలో YSR లేడు. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయిరెడ్డి పార్టీనే అని పనిలో పనిగా వైసీపీని మరోమారు విమర్శించారు.
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున కూటమి పార్టీల నేతలు చేసిన అరాచకాలపై, వైయస్ఆర్ విగ్రహాల ధ్వంసంపై ఏనాడూ తీవ్రంగా స్పందించలేదు. హెల్త్ యూనివర్సిటీపై ఉన్న వైయస్ఆర్ పేరును కూటమి నేతలు కాళ్లతో తన్నుతో ధ్వంసం చేసినా, తన తండ్రి విగ్రహాల కాళ్లు, చేతులు విరిచి, విగ్రహాలను ఈడ్చుకుంటూ వెళ్లి నిప్పు పెట్టినా ఏనాడూ నిరసన వ్యక్తం చేయలేదు.
షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పేరు మార్చి చాలా రోజులు అయినప్పటికీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఈరోజు స్పందించడం ఏంటని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శిస్తూ.. అధికారంలో లేని వైసీపీపై తీవ్ర విమర్శలు చేయడాన్ని తప్పుబడుతున్నారు.