వైఎస్ షర్మిల తన అజ్ఞానాన్నంతా బయటపెట్టుకుంటున్నారు. ఎంతసేపు తాను వైఎస్సార్ బిడ్డనని, దేనికి భయపడనని, దేనికైనా తెగించే రాజకీయాల్లోకి వచ్చానంటు పదేపదే సినిమా డైలాగులు చెప్పటానికి తప్ప ఇంకెందుకు పనికిరారని అర్థమైపోయింది. ఎన్నికలు వస్తున్నాయి కదా బర్నింగ్ ప్రాబ్లెమ్ అయిన ప్రత్యేక హోదా అంశాన్ని భుజనేసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హోదా సాధనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ధర్నాచేశారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆమె అజ్ఞానాన్ని బయటపెట్టాయి.
విభజన తర్వాత సజావుగా అమలవ్వాల్సిన చట్టం దురదృష్టవశాత్తు రాజకీయాలకు బలైపోయింది. 2014లో ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది వాస్తవం. ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యిందీ వాస్తవమే. దీనిపై షర్మిల ఏమన్నారంటే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వచ్చుండేదన్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎలా వస్తుందో అర్థంకావటంలేదు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం మనుగడ ఆధారపడున్నట్లుగా షర్మిల మాట్లాడటమే విచిత్రంగా ఉంది.
ఎంపీల రాజీనామా వల్ల ఎన్డీయే ప్రభుత్వం భయపడిపోతుందా? లేకపోతే ప్రభుత్వం కూలిపోతుందా? ఈ రెండింటిలో ఏదీ జరగదు. జగన్ ఎన్డీయేలో పార్టనర్ కాదన్న ఇంగితం కూడా షర్మిలలో లేకపోయింది. నాన్ ఎన్డీయే పార్టీల ఎంపీలు ఎంతమంది రాజీనామా చేసినా ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చిన ముప్పేముంటుంది? మోడీ ఇంకా హ్యాపీగా ఫీలవుతారని షర్మిలకు తెలీదేమో. ఏపీలోని 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే మహాయితే మళ్ళీ ఉపఎన్నికలు వస్తాయంతే.
షర్మిలకు సులభంగా అర్థంకావాలంటే ఏపీ విషయాన్నే తీసుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జగన్ ప్రభుత్వం పడిపోతుందా? అని విశ్లేషించుకుంటే సరిపోతుంది. విషయం ఏదైనా సరే జగన్‌పైన బురదచల్లేయాలి అన్న ఏకైక టార్గెట్‌తో షర్మిల పనిచేస్తోందన్న విషయం అర్థమైపోయింది. విచిత్రం ఏమిటంటే ప్రత్యేక హోదా కోసం జనాలు ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నట్లు ఖర్గేతో చెప్పించారు. మరి చంద్రబాబు హయాంలో జనాలు ప్రత్యేక హోదాను అడగలేదా? ఎదురుచూడలేదా? షర్మిల ఎంత ఎక్కువ మాట్లాడితే ఆమె అజ్ఞానం అంతగా బయటపడుతోంది.