పలు రాష్ట్రాల్లో బుల్డోజర్లు విచ్చలవిడిగా కూల్చివేతలకు పాల్పడటం, అది ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగడం.. వంటివి ఇటీవల సంచలనంగా మారాయి. ఈ బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 1 వరకు బుల్జోడర్ల కూల్చివేతలను ఆపాలని తేల్చి చెప్పింది. ఆక్రమణల తొలగింపుకి, ప్రైవేట్ ఆస్తులపైకి బుల్డోజర్లు నడిపించే చర్యలకు మధ్య తేడా ఉందని కూడా సుప్రీంకోర్చు చెప్పడం విశేషం.
బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు ఘాటుగా స్పందించింది. మూడోసారి కూడా బుల్డోజర్ న్యాయం వద్దంటూ సీరియస్ గా చెప్పింది. ఈ ప్రాక్టీస్‌ను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని తేల్చిచెప్పింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కి కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది.
వీటికి మినహాయింపు..
బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, జల వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం తమ ఆదేశాలు వర్తించవని మినహాయింపునిచ్చింది సుప్రీంకోర్టు. బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని ఆయన తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయని, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని, తమకు ఇలాంటి ఆదేశాలు వర్తించవని ఆయన చెప్పారు.