కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడం, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేయడం.. తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మరో ట్విస్ట్ నెలకొంది. ఆ క్షమాపణ సరిపోదని, సీఎం రేవంత్ రెడ్డి సరైన వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం ఆయనకు ఇచ్చింది.
ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా ఇంటర్ లోక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. కవిత బెయిల్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల్ని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టిన పోస్టింగ్ లపై, జగదీష్ రెడ్డి దరఖాస్తుకి సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
‘కబ్జాకోరులకు ఒక రూల్.. సర్కారుకు ఒక రూల్.. వాట్ ఈజ్ దిస్ అధ్యక్షా’ అంటూ కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ కి బెయిల్ ఉత్తర్వుల కాపీని కూడా జతచేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గీ ఫొటోని కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే న్యాయవాది రేవంత్ రెడ్డి తరపున సుప్రీంకోర్ట్ లో వాదనలు వినిపిస్తున్నారు. ఆగస్ట్ 29న ఆ పోస్ట్ లు సోషల్ మీడియాలో ఉంచారని, ఆగస్ట్ 30న రేవంత్ రెడ్డి కోర్టుకి క్షమాపణలు చెప్పారని.. అక్కడితో వివాదం ముగిసిపోయిందని ముకుల్ రోహత్గీ కోర్టుకి తెలిపారు. ఆ సమాధానంపై సుప్రీంకోర్టు జడ్జి సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి కొంత సంయమనం ఆశిస్తామని జడ్జి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పేందుకు రెండు వారాలు గడువిచ్చారు.