ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు వద్దంటున్నా వినిపించుకోకుండా ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని రాజాజీ పులుల అభయారణ్యానికి డైరెక్టర్‌గా నియమించడమేమిటని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని కోర్టు నిలదీసింది. ఇప్పుడు నడుస్తున్నది ఫ్యూడల్ యుగం కాదని, ఈ రోజుల్లో ప్రభుత్వాధినేతలు పూర్వకాలపు రాజుల్లా ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదని సుప్రీంకోర్టు హితవు పలికింది.
కార్బెట్ పులుల అభయారణ్యానికి గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన రాహుల్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిపై శాఖపరమైన విచారణ జరుగుతుండగా.. ఆయన్ని మళ్లీ రాజాజీ పులుల అభయారణ్యానికి డైరెక్టర్‌గా నియమించడమేమిటని ప్రశ్నించింది. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సీఎం వ్యవహరించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. శాఖపరమైన విచారణ జరుగుతున్న వ్యక్తిని మళ్లీ డైరెక్టర్‌గా నియమించకూడదని అటవీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారిపై ఆయనకు అంత అభిమానమెందుకని నిలదీసింది? ముఖ్యమంత్రిని కాబట్టి తనకిష్టమైనది చేయవచ్చని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆ అధికారి (రాహుల్) నియామకాన్ని మంగళవారం రద్దు చేశామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాహుల్ మంచి అధికారి అని, ఆయనపై ఎలాంటి ఆరోపణలూ లేవని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఏఎన్‌ఎస్ నాద్‌కర్ణి తెలపగా, అలాంటప్పుడు ఆయనపై శాఖపరమైన విచారణ ఎందుకు జరుగుతోందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. విచారణలో నిర్దోషి అని తేలనంతవరకు ఆయన మంచి అధికారి అని కితాబు ఇవ్వడం సరికాదని చెప్పారు.